ఆ 32 మంది మూల్యాంకనానికి దూరం

ABN , First Publish Date - 2020-03-21T10:51:54+05:30 IST

ఇంటర్‌బోర్డు ఎగ్జామినర్లపై కొరఢా ఝులిపించింది. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం సందర్భంగా గత ఏడాది

ఆ 32 మంది మూల్యాంకనానికి దూరం

  • జరిమానా విధించి, తప్పించిన ఇంటర్‌  బోర్డ్‌
  • గతేడాది మూల్యాంకనంలో నిర్లక్ష్యం ఫలితం


సంగారెడ్డి అర్బన్‌, మార్చి 20: ఇంటర్‌బోర్డు ఎగ్జామినర్లపై కొరఢా ఝులిపించింది. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం సందర్భంగా గత ఏడాది దొర్లిన తప్పిదాలపై బోర్డు చర్యలు తీసుకుంది. జిల్లావ్యాప్తంగా విధుల్లో పాల్గొన్న ఎగ్జామినర్లలో నిర్లక్ష్యం వహించినట్లు పునర్‌ మూల్యాంకనంలో తేలిన నేపథ్యంలో బోర్డు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలోని 32 మంది ఎగ్జామినర్లకు జరిమానా విధించింది. అంతేకాకుండా ఆ 32 మంది ఎగ్జామినర్లను ఈ సారి నుంచి మూల్యాంకనం విధుల నుంచి తప్పించింది. ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతో గతేడాది రాష్ట్రవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 


తలరాతలు తారుమారు

గతేడాది మూల్యాంకనం విధుల్లో పాల్గొన్న జిల్లాకు చెందిన కొందరు ఎగ్జామినర్లు మార్కుల కౌంటింగ్‌లో తప్పులు, రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులు వేయడం, తొందరగా పూర్తి చేయాలన్న ఆలోచనలతో పరిమితికి మించి జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే క్రమంలో పలు జవాబులకు మార్కులు కేటాయించకపోవడం తదితర కారణాలతో విద్యార్థులు అనుత్తీర్ణులు కావడంతో పాటు తక్కువ మార్కులు మెమోల్లో నమోదయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల కోరిక మేరకు ఇంటర్‌బోర్డు అధికారులు జవాబు పత్రాల పునర్‌మూల్యాంకనం చేయించాల్సి వచ్చింది. దీంతో కొందరు ఎగ్జామినర్లు నిర్లక్ష్యం వహించినట్టు బోర్డు తేల్చింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగే చిన్న పొరపాటు కూడా విద్యార్థుల తలరాతలను మార్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న 32 మంది ఎగ్జామినర్లకు రూ.5000 చొప్పున బోర్డు జరిమానా విధించింది. అందులో ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల ఎగ్జామినర్లు ఉన్నారు. వారిలో 22మంది బోర్డుకు జరిమానా చెల్లించగా, మిగిలిన 10 మంది జరిమానా చెల్లించాల్సి ఉంది. ఏదీ ఏమైనప్పటికీ గత ఏడాది జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని తప్పిదాలు పునరావృతం కాకుండా ఈ ఏడాది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి కిషన్‌ చౌహాన్‌ తెలిపారు. 

Updated Date - 2020-03-21T10:51:54+05:30 IST