వెంకటేశా.. ఇదేం తీరయా?

ABN , First Publish Date - 2020-03-02T11:31:52+05:30 IST

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రెండు రోజుల క్రితం ఆకస్మిక తనిఖీ నిర్వహించి అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో

వెంకటేశా.. ఇదేం తీరయా?

  • మల్లన్న ఆలయ ఈవో వెంకటేశ్‌ వ్యవహారశైలితో ఉద్యోగుల మధ్య విభేదాలు
  • గాడితప్పుతున్న ఆలయ కార్యాలయ పాలన
  • ఎవరికి వారుగా రాజకీయ ‘ఎత్తు(గడ)లు’
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తనిఖీల్లో తేటతెల్లమైన అవకతవకలు

చేర్యాల: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రెండు రోజుల క్రితం ఆకస్మిక తనిఖీ నిర్వహించి అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన ఈవో టంకశాల వెంకటేశ్‌ మిన్నకుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈవో ఒకరికి వత్తాసు పలుకుతూ తమను పట్టించుకోవడం లేదని మరొకరు భావిస్తున్నందున కొంతకాలంగా ఉద్యోగుల మధ్య వర్గ పోరు కొనసాగుతున్నది. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యల నివారణకు స్వతహాగా నిర్ణయాలు తీసుకోకపోగా ఆయన తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం, అభివృద్ధి పనులను వేగవంతం చేయించక పోవడం, రాజకీయ ఒత్తిడిని తట్టుకోకపోగా ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోకపోవడం విబేధాలకు తావిస్తుంది. దీంతో ఉగ్యోగులు ఎవరికి వారుగా రచ్చకెక్కడంతో ఆలయ కార్యాలయ పాలన పూర్తిగా గాడి తప్పింది. గతంలో ఫైనాన్స్‌ ఆడిట్‌లో అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన ఉద్యోగుల నుంచి రికవరీ చేయకపోవడంతో పాటు ఇటీవల చేపట్టిన ఆలయ ఉద్యోగుల అంతర్గత బదిలీల్లో నిబంధనలను పాటించకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తాజా తనిఖీల్లో ప్రధాన విభాగంలో అవకతవకలు తేటతెల్లమయ్యాయి. ఈ విషయమై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖమంత్రి ఎలాంటి చర ్యలు తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది. గత ఏడాది జాతర సమయంలో ఈవో టంకశాల వెంకటేశ్‌ ప్రసాదం తయారీ శాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రసాదం తయారీ శాల ఇన్‌చార్జి బత్తిని పోచయ్య సుమారు 36 క్యాన్ల నెయ్యితో పాటు కాజు, కిస్‌మిస్‌, చక్కెర, మిశ్రీ, పచ్చకర్పూరం తదితర వస్తువులను పక్కదోవ పట్టించేందుకు అక్రమంగా నిల్వ చేసుకుని పట్టుబడ్డాడు. దీంతో పాలకమండలి సభ్యులు సెంట్రల్‌ స్టోర్‌ పైనా అనుమానంతో తనిఖీ చేపట్టడంతో సుమారు రూ.60వేల విలువగల సామాగ్రి అదనంగా ఉండటాన్ని గమనించారు. బాధ్యులైన ఏఈవో సుదర్శనం, అసిస్టెంట్‌ మాఽధవితో పాటు పోచయ్యపై చర్యల నిమిత్తం ఉన్నతాఽధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుని ఒత్తిడి పెరగడంతో ఈవో వెంకటేశ్‌ సెలవు పెట్టారు. మరో ఈవోను తాత్కాలికంగా నియమించినా ఆయన విధుల్లో చేరకపోవడంతో హుండీ లెక్కింపు నిలిచిపోవడం మల్లన్న ఆలయ చరిత్రలో ప్రథమం. అనంతరం విధుల్లో చేరిన వెంకటేశ్‌ను ఆయా ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ఉన్నతాఽఽఽధికారులు ఆదేశించినా చర్యలకు ఇప్పటివరకు సాహసించలేదు. అంతేకాకుండా ఆలయ ఎలక్ర్టీషియన్‌ అంజయ్య తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కొన్ని నెలల క్రితం ఏఈ పదోన్నతి పొందిన  విషయమై ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ప్రత్యామ్నాయ చర్యలు లేకపోవడంతో ఆలయ ద్వితీయశ్రేణి అధికారులు, ఉద్యోగుల మధ్య కొద్దిరోజులుగా వివాదాలు చోటుచేసుకుంటున్నా పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో ఈవో పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏఈవో సుదర్శనంను బదిలీ చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కొన్ని నెలలుగా ఉన్నతాధికారులను కోరినప్పటికీ చర్యలు తీసుకోకపోగా, కొత్తగా మరో ఏఈవోను నియమించడం మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఇక ఉద్యోగులు ఎవరికి వారుగా ఎత్తుగడలు వేస్తుండటంతో ఎవరిని బదిలీ చేస్తారో, అవినీతి ఆరోపణలు, అక్రమ పదోన్నతుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈవో వెంకటేశ్‌పై ఒత్తిడి ఉండటంతో గతంలో మాదిరి తట్టుకోలేక సెలవు పెడతారా? లేక విధుల్లో కొనసాగుతూ కార్యాలయ పాలనను గాడిన పెడతారా? అన్న విషయాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Updated Date - 2020-03-02T11:31:52+05:30 IST