రైతులకు పరిహారం ఇవ్వాలని ధర్నా
ABN , First Publish Date - 2020-12-06T05:32:17+05:30 IST
మండలంలోని దుద్దెడ శివారులో చేపట్టిన కలెక్టరేట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు సరైన పరిహారం ఇవ్వాలని కోరుతూ శనివారం రైతులు నూతన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.

కొండపాక, డిసెంబరు 5: మండలంలోని దుద్దెడ శివారులో చేపట్టిన కలెక్టరేట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు సరైన పరిహారం ఇవ్వాలని కోరుతూ శనివారం రైతులు నూతన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూములు తీసుకునే ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని వాపోయారు. భూములు కోల్పోయిన కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం, 250 గజాల ప్లాటు, భూముల్లో ఉన్న బోరు బావులకు, పండ్ల తోటలకు పరిహారం ఇస్తామని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ధర్నా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిహారం విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. సోమవారం వరకు సమస్యను పరిష్కరించకుంటే మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కొండపాక మండలాధ్యక్షుడు కొమ్ము మల్లిఖార్జున్, దుద్దెడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు నాగరాజు, మల్లేశం పాల్గొన్నారు.