‘ధరణి’ రిజిస్ట్రేషన్‌లో 2వ స్థానం

ABN , First Publish Date - 2020-11-19T05:30:00+05:30 IST

వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకత, కాలయాపనను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ కార్యకలాపాల్లో మెదక్‌ జిల్లా ముందంజలో ఉంది.

‘ధరణి’ రిజిస్ట్రేషన్‌లో 2వ స్థానం
మెదక్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన రైతులు

రాష్ట్రంలో ముందంజలో మెదక్‌ జిల్లా

అవాంతరాలు లేకుండా జోరుగా రిజిస్ట్రేషన్లు

పారదర్శకంగా, సజావుగా ప్రక్రియ

సర్కారు, జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ

మెదక్‌ జిల్లాలో ఇప్పటివరకు 1,496 రిజిస్ట్రేషన్లు 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, నవంబరు 19: వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకత, కాలయాపనను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ కార్యకలాపాల్లో మెదక్‌ జిల్లా ముందంజలో ఉంది. సాంకేతిక సమస్యలు అధిగమించి జిల్లాలో జోరుగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తయి ప్రొసీడింగ్‌ ఇవ్వడంతో ప్రజలు, రైతులు ధరణి పోర్టల్‌ సేవలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరణి అమలులో రాష్ట్రంలో మెదక్‌ జిల్లా రెండో స్థానంలో ఉండటం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కార్యకలాపాలు ఊపందుకునేలా చొరవ చూపుతుండటంతో క్షేత్రస్థాయిలో చకచకా పనులు జరిగిపోతున్నాయి. 


ఊపందుకున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

ధరణి పోర్టల్‌ ద్వారా జిల్లాలో రోజురోజుకూ రిజిస్ట్రేషన్లు ఊపందుకుంటున్నాయి. దశాబ్దాల క్రితం నుంచి అమల్లో ఉన్న విధానాల కారణంగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, మ్యుటేషన్‌, కొత్త పాస్‌బుక్‌ జారీకి ఎన్నో ఇబ్బందులు ఉండేవి. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వ్యయప్రయాసాలు పడితేగానీ పట్టా పాసుబుక్‌ చేతికి వచ్చేది కాదు. ఈ ప్రక్రియలో లంచాల రూపంలో డబ్బు చేతులు మారేది. అంత చేసినా రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. దీంతో భూసమస్యల పరిష్కారం కాకపోగా నానాటికీ పెరిగిపోసాగాయి. దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తేవడంతో పాటు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో సమూల మార్పులు చేసింది. ధరణి పోర్టల్‌ ద్వారా మండలాల చెంతకే రిజిస్ట్రేషన్లు చేసే అవకాశాన్ని కల్పించింది. నవంబరు రెండో తేదీ నుంచి సేవలు అందుబాటులోకి తెచ్చారు. ముందుగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రారంభించారు. ఇందు కోసం తహసీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా గుర్తింపునిచ్చారు. మొదట్లో సాంకేతిక సమస్యలు, సిబ్బందికి, ప్రజలకు అవగాహన లేని కారణంగా పలు సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కరించడంతో రోజురోజుకూ జిల్లాలో రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. మెదక్‌ జిల్లాలోని 20 మండలాల్లోనూ రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సకాలంలో ప్రక్రియ పూర్తయ్యేలా పని చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నాటికి జిల్లాలో 1,579 మంది రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌లు నమోదు చేసుకోగా.. 1,496 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రిజిస్ట్రేషన్‌ అయి, మ్యుటేషన్‌ పూర్తి చేసి, కొనుగోలుదారులకు ప్రొసీడింగ్‌ జారీ చేయడం పదిహేను నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతోంది. ధరణి రిజిస్ట్రేషన్లలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా.. మెదక్‌ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మొదట్లో పలు చోట్ల చిన్నచిన్న అవాంతరాలు తలెత్తినా ఇప్పుడు అంతటా సాఫీగా సాగుతోంది. పోర్టల్‌ ద్వారా వేగంగా సేవలు అందుతుండటంతో రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌కు ఇప్పటికీ కొందరు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు. 


విజయవంతంగా అమలు

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రజలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు పొందుతున్నారు. అమలులో జిల్లాలో ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నాం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ, తహసీల్దార్లు, సిబ్బంది అందరి కృషితోనే ఇది సాధ్యమైంది.

-శివ, మెదక్‌ జిల్లా కోఆర్డినేటర్‌, ధరణి పోర్టల్‌


Updated Date - 2020-11-19T05:30:00+05:30 IST