ధరణితో భూ సమస్యలు దూరం

ABN , First Publish Date - 2020-11-06T10:47:47+05:30 IST

ధరణి సేవలతో భూ సమస్యలు దూరమవుతాయని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ భారతి హోలికేరి కోరారు

ధరణితో భూ సమస్యలు దూరం

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట కలెక్టర్‌ భారతి హోలికేరి


ములుగు, నవంబరు 5 : ధరణి సేవలతో భూ సమస్యలు దూరమవుతాయని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ భారతి హోలికేరి కోరారు. గురువారం ములుగులో ధరణి ద్వారా చేస్తున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆమె పరిశీలించారు. ధరణి సేవలు ఎలా ఉన్నాయి, రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ సౌలభ్యంగా ఉందా.. సేవలు పొందే క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని భూ విక్రేతలు, కొనుగోలుదారులను ప్రశ్నించి ధరణి పోర్టల్‌ సేవలపై ప్రజా స్పందనను అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరణి సేవల అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రారంభ దశలో ఎదురవుతున్న బాలారిష్టాలు, సాంకేతిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు మరింత వేగంగా సులభంగా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్‌తో భూవివాదాలకు తెర పడుతుందన్నారు. అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. ధరణి ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ల వివరాలు తహసీల్దార్‌ కార్యాలయంలో క్లుప్తంగా ఉండాలని, తప్పనిసరిగా లాగ్‌బుక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.


సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యల తీసుకోవాలని ఆదేశించారు. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌బుక్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ను మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా కేవలం రూ.200 చెల్లించి చేసుకోవచ్చని, స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ధరణి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. ఆమె వెంట అడిషనల్‌ కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, తహసీల్దార్‌ యాదగిరిరెడ్డి తదితరులున్నారు. 

Updated Date - 2020-11-06T10:47:47+05:30 IST