ఆలయాల్లో సందడి

ABN , First Publish Date - 2020-12-14T04:56:42+05:30 IST

కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు.

ఆలయాల్లో సందడి
కొమురవెల్లి రాజగోపుర ఆవరణలో భక్తుల రద్దీ

 కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు

 కొమురవెల్లి మల్లన్న ఆలయానికి తరలివచ్చిన భక్తులు


చేర్యాల, డిసెంబరు 13: ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మల్లన్నకు గంగిరేగుచెట్టు ప్రాంగణంలో నజరు, బసచేసిన ప్రదేశంలో చెలక పట్నాలు రచించి మొక్కులు తీర్చుకున్నారు. బోనం నివేదించారు. అనంతరం మల్లన్నను దర్శించుకుని ఒడిబియ్యం, పట్టువస్త్రాలు, బండారి సమర్పించారు. గుట్టపైన వెలసిన ఎల్లమ్మను దర్శించుకుని బోనం సమర్పించారు. బెల్లంపానకం, కల్లు శాక పెట్టి ఒడిబియ్యం పోశారు. భక్తులు నిర్వహించిన ఆర్జిత సేవలు, వసతి గదుల అద్దె, పట్నాలు, బోనాలు, ప్రసాద విక్రయాలు, ప్రత్యేక దర్శనాలు, ఇతరాల ద్వారా సుమారు రూ.2లక్షల మేర ఆదాయం సమకూరినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు చర్యలు తీసుకున్నారు. మల్లికార్జునస్వామిని ఆదివారం ఆర్టీఐ కమిషనర్‌ గుగులోత్‌ శంకర్‌నాయక్‌ దర్శించుకున్నారు. 


ఘనంగా సహస్ర దీపార్చన


హుస్నాబాద్‌రూరల్‌, డిసెంబరు 13: హుస్నాబాద్‌ పట్టణంలోని మరకత లిగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి భక్తులు సహస్ర దీపార్చన నిర్వహించారు. అలాగే పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చారు.


నాచగిరిలో సామూహిక వ్రతాలు


వర్గల్‌, డిసెంబరు 13: కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో మండలంలోని నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వ్రతాల్లో పాల్గొన్నారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్‌ సుధాకర్‌రెడ్డి తెలిపారు. 


Updated Date - 2020-12-14T04:56:42+05:30 IST