నెలాఖరుకు అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-03-02T11:26:45+05:30 IST

నర్సాపూర్‌ నియోజకవర్గ ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.25 కోట్ల నిధులను మంజూరు చేసినందున

నెలాఖరుకు అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

  • అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష

నర్సాపూర్‌: నర్సాపూర్‌ నియోజకవర్గ ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.25 కోట్ల నిధులను మంజూరు చేసినందున తక్షణం పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులతో ఆయన సమీక్షించారు. గజ్వేల్‌ కోమటిబండ నుంచి నర్సాపూర్‌ నియోజకవర్గానికి తాగునీటి సరఫరాకు పనులు తక్షణం ప్రారంభించాలని ఆదేశించారు. శివ్వంపేట మండలంలో నిర్మించనున్న సంపు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని తక్షణం నీటి సరఫరా విభాగానికి అప్పగించాలని కలెక్టర్‌ ధర్మారెడ్డికి సూచించారు. 


సాధ్యమైనంత త్వరగా టెండర్లు పిలిచి పనులను పూర్తి చేయాలని చెప్పారు. శివ్వంపేట, వెల్దుర్తి మండలాలకు 15 రోజుల్లో, ఇతర మండలాలకు ఏప్రిల్‌ వరకు నీతిని అందించాలన్నారు. నర్సాపూర్‌ మినహా అందోల్‌, మెదక్‌, నారాయణఖేడ్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాలకు సింగూరు ప్రాజెక్టులోని నీటిని రోజు విడిచి రోజు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో వేసవిలో ఏ గ్రామంలో కూడా తాగునీటి ఎద్దడి రాకుడదన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులకు ఇసుక తరలింపుపై కలెక్టర్‌కు అధికారులు నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేయాలన్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఇసుకను తక్షణం తరలించి నిల్వ చేసుకోవాలన్నారు. ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఇప్పటికీ మొదలు కాని పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.


కందుల కొనుగోలుకు చర్యలు


జిల్లా కేంద్రం మెదక్‌తో పాటు నర్సాపూర్‌లోనూ కందుల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కందులను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న కందులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. నర్సాపూర్‌లోనూ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ కేంద్రంలో సంగారెడ్డి జిల్లాలోని హత్నూర, గుమ్మడిదల మండలాల రైతుల నుంచి కూడా కందులను కొనుగోలు చేయాలని చెప్పారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్‌ నగేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌, ఆయా శాఖల ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T11:26:45+05:30 IST