రుణమాఫీ కాలేదు.. వేధింపులు తప్పడం లేదు

ABN , First Publish Date - 2020-12-27T05:42:06+05:30 IST

అధికారుల నిర్లక్ష్యమో.. బ్యాంకర్ల తప్పిదమో. కానీ ఆ రైతులకు రుణం తీరని వ్యధగా మారింది. ఆరేండ్లుగా దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎస్‌ఐబీ పరిధిలోని 2026 మంది రైతులకు రుణ వేధింపులు తప్పడం లేదు.

రుణమాఫీ కాలేదు.. వేధింపులు తప్పడం లేదు
రుణాలు చెల్లించాలంటూ సభ పెట్టిన బ్యాంకర్లు

కట్టి తీరాలంటూ గ్రామానికి వెళ్లిన బ్యాంకర్లు

తిరిగి పంపిన హబ్షీపూర్‌ రైతులు

దుబ్బాక, డిసెంబరు 26 : అధికారుల నిర్లక్ష్యమో.. బ్యాంకర్ల తప్పిదమో. కానీ ఆ రైతులకు రుణం తీరని వ్యధగా మారింది. ఆరేండ్లుగా దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎస్‌ఐబీ పరిధిలోని 2026 మంది రైతులకు రుణ వేధింపులు తప్పడం లేదు. శనివారం దుబ్బాక మండలం హబ్షీపూర్‌ గ్రామానికి చెందిన రైతుల రుణాల వసూళ్లకు వెళ్లిన బ్యాంకర్లకు చేదు అనుభవం ఎదురైంది. రైతుల ఆగ్రహాన్ని చల్లార్చి.. వారికి బ్యాంకర్ల తప్పిదాన్ని అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. బ్యాంకర్ల పుణ్యాన ఒక్క పైసా రుణం మాఫీ కాకపోవడంతో పాటు తమ ఖాతాలో జమైన వడ్లు, మొక్కజొన్న ధాన్యం డబ్బులు కూడా పాత బకాయిల కింద జమచేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా రైతుబంధును కూడా రుణాల మిత్తి కిందనే జమచేసుకుంటూ ఆరేళ్లుగా బ్యాంకర్లు తమను అరిగోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఒక్క పైసా కట్టమని రైతులు చెప్పడంతో బ్యాంకర్లు తిరిగి వెళ్లిపోయారు. 

Updated Date - 2020-12-27T05:42:06+05:30 IST