నిందితుల ఇంటి ఎదుటే దహన సంస్కారం చేస్తాం

ABN , First Publish Date - 2020-09-21T07:25:27+05:30 IST

ఇరు వర్గాల ఘర్షణలో తీవ్రంగా గాయాలపాలై చికిత్సపొందుతూ మృతిచెందిన వ్యక్తి దహన సంస్కారాలను నిందితుల ఇంటి ఎదుటే

నిందితుల ఇంటి ఎదుటే దహన సంస్కారం చేస్తాం

ఇరువర్గాల ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతితో కుటుంబీకుల మంకుపట్టు 

బర్రెంకల తండాలో 14 గంటల పాటు ఉద్రిక్తత 

 

టేక్మాల్‌, సెప్టెంబరు 20: ఇరు వర్గాల ఘర్షణలో తీవ్రంగా గాయాలపాలై చికిత్సపొందుతూ మృతిచెందిన వ్యక్తి దహన సంస్కారాలను నిందితుల ఇంటి ఎదుటే చేస్తామని కుంటుంబీకులు భీష్మించడంతో 14 గంటల పాటు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంఘటన టేక్మాల్‌ మండల పరిధిలోని బర్రెంకల తండాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 5న తర్మానికుంట వాసులకు చెందిన ఆవు బర్రెంకల కుంటకు చెందిన వారి పంట చేనులో మేసింది. ఈ విషయంలో ఇరు వర్గాలు గొడవ పడగా కర్రలతో, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఆ దాడిలో బర్రెంకల కుంట తండాకు చెందిన మెఘావత్‌ రతన్‌సింగ్‌(35)కు బలమైన దెబ్బలు తగిలాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. అయితే మెఘావత్‌ రతన్‌సింగ్‌ మృతదేహం శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బర్రెంకల తండాకు చేరింది.


మృతదేహాన్ని దహనం చేయబోమంటూ కుటుంబీకులు ఆగ్రహంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోకుండా తండాలో భారీగా పోలీసులను మోహరించారు. రతన్‌సింగ్‌ను చంపిన నిందితులను అప్పగించాలంటూ వారు డిమాండ్‌ చేశారు. దాదాపు 14 గంటల పాటు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళన చేపట్టారు. ఆదివారం నిందితుల ఇంటి ఎదుటే దహన సంస్కారం చేస్తామంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ మేరకు దహన సంస్కారాలకు వారు ఏర్పాట్లు చేస్తుండగా  పోలీసులు జోక్యం చేసుకొని చెదరగొట్టారు. గ్రామ శివారులో దహనసంస్కారాలకు ఏర్పాట్లు చేయించారు. మధ్యాహ్నం సమయంలో రతన్‌సింగ్‌ అంత్యక్రియలు ముగిశాయి. అల్లాదుర్గం సీఐ రవి, మెదక్‌ రూరల్‌ సీఐ పాలవెల్లి, మెదక్‌ పట్టణ ఎస్‌ఐ అనిల్‌కుమార్‌, టేక్మాల్‌ ఎస్‌ఐ లింబాద్రి, రేగోడ్‌ ఎస్‌ఐ కాశీనాథ్‌, అల్లాదుర్గం సీఐ మోహన్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తును నిర్వహించారు. అంత్యక్రియల అనంతరం తండాలో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-09-21T07:25:27+05:30 IST