నకిలీ బంగారం కట్టబెట్టి రూ.4 లక్షలతో ఉడాయింపు

ABN , First Publish Date - 2020-11-07T10:07:02+05:30 IST

తక్కువ ధరకే బంగారం ఇస్తానని నమ్మించి రూ. 4 లక్షలు తీసుకుని ఉడాయించిన సంఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేటలో వెలుగులోకి వచ్చింది

నకిలీ బంగారం కట్టబెట్టి రూ.4 లక్షలతో ఉడాయింపు

తక్కువ ధరకే బ్రిటిష్‌ కాలం నాటి నాణేలు ఇస్తామంటూ టోకరా


పాపన్నపేట, నవంబరు 6: తక్కువ ధరకే బంగారం ఇస్తానని నమ్మించి రూ. 4 లక్షలు తీసుకుని ఉడాయించిన సంఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేటలో వెలుగులోకి వచ్చింది. బ్రిటిష్‌ కాలం నాటి బంగారు నాణేలు తక్కువ ధరకే అమ్ముతామని చెప్పి పలువురి దగ్గర రూ. కోటి వరకు మోసానికి పాల్పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలోనే బాధితుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.


పోలీసుల కథనం మేరకు మండలంలోని యూసు్‌ఫపేట గ్రామానికి చెందిన బాజ బుచ్చయ్య స్ర్కాప్‌ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి దగ్గరికి తరచుగా రగ్గుల వ్యాపారం చేసుకుంటున్న రమేష్‌ అనే వ్యక్తి వచ్చేవాడు. తనది అనంతపురం జిల్లా అని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇలా దసరా పండుగకు రెండు రోజుల ముందు బుచ్చయ్య దగ్గరికి వచ్చిన రమేష్‌ తన వద్ద బ్రిటిష్‌ కాలం నాటి బంగారు నాణేలు ఉన్నాయని, అవసరమైనవారికి తక్కువ ధరకు ఇస్తానని నమ్మించాడు. ముందుగా విక్టోరియా రాణి బొమ్మ ఉన్న రెండు అసలు బంగారు నాణేలను ఇచ్చాడు. వాటిని బుచ్చయ్య మరుసటి రోజు మెదక్‌ పట్టణంలోని ఓ స్వర్ణకారుడి వద్ద పరీక్ష చేయించగా అసలు బంగారమని తేలింది. నాలుగు రోజుల అనంతరం బుచ్చయ్యకు ఫోన్‌ చేసిన రమేష్‌ బంగారం ఎంత కావాలని అడిగాడు.


30 తులాలు కావాలని అడగగా బంగారం తీసుకొని యూసఫ్‌పేటకు వచ్చాడు. 30 తులాల బంగారానికి రూ.12 లక్షలు చెల్లించేందుకు ఒప్పుకున్న బుచ్చయ్య మొదటగా రూ.4 లక్షలు రమే్‌షకు ముట్టజెప్పాడు. మిగతా మొత్తం నెలకు రూ.లక్ష చొప్పున ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. మరుసటిరోజు బుచ్చయ్య బంగారాన్ని పరీక్ష చేయించగా నకిలీదని తేలింది. దీంతో మోసపోయినట్లు బాధితుడు గ్రహించాడు. గ్రామపెద్దల సూచన మేరకు బుచ్చయ్య శుక్రవారం రాత్రి పాపన్నపేట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్‌ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదేవిధంగా మోసగాళ్లు పలువురి వద్ద రూ.కోటి వరకు వసూలు చేశారని, భయంతో వారెవరూ ఫిర్యాదు చేయలేదని స్థానికంగా ప్రచారం జరుగుతున్నది.

Updated Date - 2020-11-07T10:07:02+05:30 IST