దళారుల దగా
ABN , First Publish Date - 2020-12-03T06:08:34+05:30 IST
పత్తి కొనుగోళ్లలో దళారుల దందా అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్నది. జిన్నింగ్ మిల్లుల యజమాన్యాలు, దళారులు కుమ్మక్కై రైతుల శ్రమను గద్దల్లా తన్నుకుపోతున్నారు.

పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లుల యజమానులతో కుమ్మక్కు
తేమ సాకుతో రైతులకు కుచ్చుటోపి
మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోలు
మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ కరువు
జిన్నింగ్ మిల్లుల వద్ద రోజుల తరబడి రైతుల నిరీక్షణ
అన్నదాతకు తలనొప్పిగా వాహనాల వెయిటింగ్ ఛార్జీలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి/సంగారెడ్డి టౌన్ : పత్తి కొనుగోళ్లలో దళారుల దందా అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్నది. జిన్నింగ్ మిల్లుల యజమాన్యాలు, దళారులు కుమ్మక్కై రైతుల శ్రమను గద్దల్లా తన్నుకుపోతున్నారు. తేమ శాతం పేరిట దోచుకుంటున్నారు. మద్దతు ధర కంటే తక్కువ రేటును చెల్లించి రైతుకు కుచ్చుటోపి పెడుతున్నారు. తేమ సాకుతో మిల్లుల యజమానులు, దళారులు సృష్టించిన ఉచ్చులో పడి రైతులు బలవుతున్నారు. అన్నదాతలకు సాకులు చెబుతున్న మిల్లులు యజమానులు మాత్రం దళారీల ద్వారా వచ్చే పత్తిని మాత్రం నేరుగా కొనుగోలు చేస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దళారీల దందా యథేచ్ఛగా సాగుతున్నది.
సంగారెడ్డి జిల్లాలో పత్తిని కొనుగోలు చేయడానికి మార్కెటింగ్ శాఖ 15 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత నెల మొదటి వారంలో ప్రారంభమైన పత్తి కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. 8 శాతం నుంచి 12 శాతం లోపు తేమ కలిగిన పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం విధించిన నిబంధనలు దళారులు, జిన్నింగ్ మిల్లుల యజమాన్యాలకు వరంగా మారింది. రైతన్నలు అద్దె వాహనాల్లో జిన్నింగ్ మిల్లుల వద్దకు తీసుకొచ్చిన పత్తిని తేమ శాతం సరిగ్గా లేదంటూ తిరస్కరిస్తున్నారు. ఫలితంగా మిల్లుల వద్దే రైతులు రెండు, మూడు రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తున్నది. దాంతో రైతుల నుంచి వాహనదారులు వెయిటింగ్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఒక్కో వాహనానికి వెయిటింగ్ ఛార్జీల కింద రోజుకు రూ.1500 నుంచి రూ.2 వేల వరకు తీసుకుంటున్నారు. దీంతో పత్తి రైతులపై మరింత భారం పడుతున్నది.
రైతుల వద్ద క్వింటాల్‌కు రూ.5,100 కొనుగోళ్లు
తేమ సరిగ్గా లేదంటూ జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తిని తిరస్కరించడంతో జిన్నింగ్ మిల్లుల వద్ద రోజుల తరబడి నిరీక్షించలేని రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. తక్కువ ధరకే విక్రయించి నష్టపోతున్నారు. రైతు నుంచి క్వింటాలుకు రూ.5,100 కొనుగోలు చేస్తున్న దళారులు జిన్నింగ్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం క్వింటాల్‌కు రూ.5,825 విక్రయిస్తున్నారు. దళారీలు క్వింటాల్ పత్తిపై రూ.600 నుంచి రూ.750 వరకు సంపాదిస్తున్నారు. ఇందులో దళారులు, జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సగం-సగం పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని జిన్నింగ్ మిల్లుల వద్ద దళారులు యథేచ్ఛగా దందా చేస్తున్నప్పటికీ మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
2,17,844 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు
జిల్లాలోని 15 పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు మొత్తం 2,17,844 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు. జిల్లాలోని సదాశివపేట, రాయికోడ్, జోగిపేట, వట్పల్లి, నారాయణఖేడ్ మండలాల పరిధిలో మొత్తం 15 జిన్నింగ్ మిల్లులకు పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలో 1,82,939 మంది రైతులు 3,99,815 ఎకరాల్లో పత్తిని సాగు చేయగా గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా 50 శాతం పత్తి పంట నీటి పాలైనట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే జిల్లాలో ఈసారి 4,30,894 మెట్రిక్ టన్నుల పత్తి పంట దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. గత నెల మొదటి వారంలో ప్రారంభమైన పత్తి కొనుగోళ్లలో ఇప్పటివరకు 7,929 మంది రైతుల నుంచి రూ.124.60 కోట్ల విలువ చేసే 2,17,844 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. కాగా 75,100 క్వింటాళ్ల పత్తికి సంబంధించి 2,822 మంది రైతులకు రూ.42.89 కోట్ల చెల్లింపులను చేశారు. పత్తిని కొనుగోలు చేసిన 72 గంటల్లోగా రైతులకు చెల్లింపులు చేస్తామని ఓ వైపు అధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. అయితే ఇంకా 1,42,744 క్వింటాళ్ల పత్తికి సంబంధించి 5,107 మంది రైతులకు రూ.81.71 కోట్ల చెల్లింపులు జరగాల్సి ఉన్నది.
