పండుగ పూట..కరోనాతో పైలం

ABN , First Publish Date - 2020-10-24T11:53:33+05:30 IST

రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద పండగ విజయదశమి. బతుకమ్మ వచ్చిందంటే పల్లెల్లో సందడే సందడి. ఇవి ప్రజలు సామూహికంగా జరుపుకునే సంబురాలు కావడంతో అప్రమత్తత తప్పనిసరని వైద్య నిపుణులు

పండుగ పూట..కరోనాతో పైలం

సంబురాల్లో స్వీయ జాగ్రత్తలు తప్పని సరి


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, అక్టోబరు 23: రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద పండగ విజయదశమి. బతుకమ్మ వచ్చిందంటే పల్లెల్లో సందడే సందడి. ఇవి ప్రజలు సామూహికంగా జరుపుకునే సంబురాలు కావడంతో అప్రమత్తత తప్పనిసరని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో కొన్ని రోజులుగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్యను బట్టి మహమ్మారి తీవ్రత తగ్గినట్లు కనిపిస్తున్నా జాగ్రత్తలు తీసుకోవాలని వారు గుర్తు చేస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వైరస్‌ విజృంభించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ ముప్పు ఉన్నదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనల నేపథ్యంలో పండగను ప్రభుత్వ సూచనలకు జరుపుకోవాలని, వీలయితే ఇంటి గడప దాటకుండా ఉండడం మేలని పేర్కొంటున్నారు. 


కరోనా తగ్గుముఖం పట్టిందనే అలక్ష్యం వద్దు

జిల్లాలో గతంతో పోలిస్తే కరోనా తీవ్రత తగ్గినట్లు వైద్య ఆర్యోగ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 3,350 మంది వైరస్‌ బారిన పడగా అందులో 80 శాతానికి పైగా చికిత్స పొంది కోలుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్యను గత మూడు నెలలుగా పెంచినా    పాజిటివ్‌ రేటు తక్కువగా రావడం సాకుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నిత్యం 50కి పైగానే పాజిటివ్‌ కేసులు నమోదయ్యేవి.  గత పదిహేను రోజులుగా ఈ సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజుకి పది నుంచి 20 దాటడంలేదు. అయితే దసరా నేపథ్యంలో షాపింగ్‌, ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అటువంటి సయమాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభం కావడంతో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సద్దుల బతుకమ్మను ఈసారి ఇంటి వద్దనే జరుపుకోవాలని ప్రభుత్వం, వైద్యులు సూచిస్తున్నారు.


ఉగాది, వినాయక చవితి పండగులను పరిమితులకు లోబడి, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. అదే తరహాలోనే దసరా ఉత్సవాలను జరుపుకోవాలని సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రంగా కొడుక్కోవడం వంటి వాటిని తప్పని సరిగా పాటించాలని కోరుతున్నారు. అదే విధంగా చలి కాలం కావడంతో వైరస్‌ విజృంభించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.  ముఖ్యంగా ప్రయాణాల సందర్భంగా తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యధికారి వెంకటేశ్వరావు చెబుతున్నారు. 

Updated Date - 2020-10-24T11:53:33+05:30 IST