సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. ఇద్దరికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-05-17T10:12:05+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో మరోసారి కరోనా కలకలం మొదలైంది. ప్రశాంతంగా ఉన్న పటాన్‌చెరు పారిశ్రామికవాడలో వైరస్‌ బాధితులను గుర్తించారు.

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. ఇద్దరికి పాజిటివ్‌

పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో తండ్రీ కొడుకులకు కోవిడ్‌-19 నిర్ధారణ

అస్సాం కార్బన్‌ పరిశ్రమలో పనిచేస్తున్న బాధితుడు

సన్నిహితంగా మెలిగిన కార్మికులందరికీ హోం క్వారంటైన్‌

సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్‌కు కుటుంబ సభ్యులు

ఆర్‌కే కాలనీలో హైఅలర్ట్‌ ప్రకటించిన అధికారులు

కాలనీలోని మొత్తం వీధుల్లో రసాయనాల పిచికారీ

కాలనీకి వెళ్లే రహదారుల దిగ్బంధం


పటాన్‌చెరు, మే 16: సంగారెడ్డి జిల్లాలో మరోసారి కరోనా కలకలం మొదలైంది. ప్రశాంతంగా ఉన్న పటాన్‌చెరు పారిశ్రామికవాడలో వైరస్‌ బాధితులను గుర్తించారు. పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఒకరికి(40), ఆయన కుమారుడి(8)కి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితుడు పటాన్‌చెరు పట్టణంలోని పారిశ్రామికవాడలో అస్సాం కార్బన్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. వారం రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భార్య, కుమారుడు సైతం తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతుండడంతో గురువారం సాయంత్రం చికిత్స కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. కరోనా లక్షణాలున్నట్లు గుర్తించిన డాక్టర్లు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ చెస్ట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా తండ్రి, కుమారుడికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. తల్లికి మాత్రం నెగటివ్‌ అని తేల్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితుడు నివాసమున్న ప్రాంతాన్ని కట్టడిలోకి తీసుకున్నారు. రోడ్లను మూసివేసి చుట్టుపక్కల ఇళ్లవారిని అప్రమత్తం చేశారు. ఆ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన నాలుగు కుటుంబాల్లోని 19 మందిని స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. గత కొద్ది రోజులుగా బాధితుడు ఎవరెవరిని కలిశాడనేది ఆరా తీస్తున్నారు. 


ఎన్‌ఆర్‌ఐ సిటీ కాలనీ దిగ్బంధం

కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసు వెలుగులోకి రావడంతో ఎన్‌ఆర్‌ఐ సీటీ కాలనీని అధికారులు దిగ్బంధం చేశారు. తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి, సీఐ నరేష్‌, వైద్య సిబ్బంది శనివారం ఉదయమే కాలనీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన వైద్య బృందాలు కాలనీలో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, జలుబుతో బాధపడుతున్నారా అని ఆరా తీశారు. అగ్నిమాపక దళ సిబ్బంది కాలనీలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. పంచాయతీ సిబ్బంది శానిటేషన్‌ నిర్వహించారు. బాధితులు మొదట చికిత్స కోసం వెళ్లిన పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. వారికి చికిత్స నిర్వహించిన వార్డును సీజ్‌ చేశామని, పరీక్షలు నిర్వహించిన సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వసుంధర తెలిపారు. ఆసుపత్రి ఆవరణను స్టెరిలైజ్‌ చేశామని పేర్కొన్నారు.


ఆందోళనలో అస్సాం కార్బన్‌ కార్మికులు: పరిశ్రమను మూసివేసిన అధికారులు

పటాన్‌చెరు పట్టణంలోని అస్సాం కార్బన్‌ పరిశ్రమలో పనిచేసే వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ సడలించడంతో పది రోజుల క్రితం పరిశ్రమ పనిచేయడం ప్రారంభమైంది. ఇక్కడ పనిచేసే కార్మికుడికి వైరస్‌ సోకినట్లు నివేదిక రావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు పరిశ్రమను మూసివేయించారు. పరిశ్రమలో 60 మంది పర్మినెంట్‌, 200 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. బాధితుడితో కలిసి పనిచేసినవారికి గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కార్మికుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించారు. 


ఎలా సోకినట్లు?

బాధితుడికి వైరస్‌ ఎలా సోకిందనే విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. పరిశ్రమలో తోటి కార్మికుల నుంచే సోకి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమలో ఇంకా పాజిటివ్‌ వ్యక్తులు ఉన్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పటాన్‌చెరు తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ బాధితుడికి కరోనా ఎలా సోకిందనేది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. ముందుజాగ్రత్తగా కార్మికులందరికీ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఆదివారం రెండు ప్రత్యేక బృందాలు పటాన్‌చెరుకు వస్తున్నాయన్నారు. ఇంద్రేశంలో బాధితుడి నివాస పరిసరాల్లో ఒక బృందం, అస్సాం కార్బన్‌ పరిశ్రమ కార్మికులకు మరో బృందం పరీక్షలు నిర్వహిస్తాయని తెలిపారు. పారిశ్రామికవాడలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా తీవ్రమైన జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడితే అధికారులకు తెలియజేయాలని కోరారు.


Updated Date - 2020-05-17T10:12:05+05:30 IST