మల్లంపల్లిలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-04-18T10:15:59+05:30 IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామంలో ఓ యువకుడికి కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో

మల్లంపల్లిలో కరోనా కలకలం

తుమ్ములు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న యువకుడిని క్వారంటైన్‌కు తరలించిన అధికారులు

ఇరవై రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి వచ్చిన యువకుడు

భయాందోళనలో గ్రామస్థులు


అక్కన్నపేట, ఏప్రిల్‌ 17: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామంలో ఓ యువకుడికి కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో స్థానికంగా  కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 23న కుటుంబ సమేతంగా మల్లంపల్లి వచ్చాడు. గురువారం తుమ్ములు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ తన ఆరోగ్యం బాగాలేదని హుస్నాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి రాత్రి వెళ్లడంతో వైద్యులు అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.


అతని పరిస్థితిని పరిశీలించిన వైద్యాధికారులు ప్రత్యేక ఆంబులెన్స్‌లో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్వారంటైన్‌కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టు వచ్చేవరకు అతన్ని క్వారంటైన్‌లో ఉంచారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. మూడు రోజులపాటు గ్రామస్థులెవ్వరూ ఇంట్లోంచి బయటకు రాకుండా గృహనిర్బంధం విధించారు. గ్రామంలోని నాలుగు రహదారులను మూసేసి లోపలకి ఎవరూ రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.


గ్రామంలోని వీధుల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు. హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీపీ సందెపోగు మహేందర్‌, వైద్యాధికారి మురళీకృష్ణ, తహసీల్దార్‌ వేణుగోపాల్‌రావు, ఎంపీడీవో సత్యపాల్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి ప్రజలు ఆందోళన చెందకూడదని దైర్యం చెప్పి పలు సూచనలు చేశారు.

Updated Date - 2020-04-18T10:15:59+05:30 IST