అమ్మో.. మీది కిష్టాపూరా..? వెలివేసినట్టు చూస్తున్న మిగతా గ్రామాల ప్రజలు
ABN , First Publish Date - 2020-05-13T17:44:41+05:30 IST
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ అంటేనే చుట్టు పక్కల గ్రామాల ప్రజ లు భయపడుతున్నారు. మొన్నటి వర కు కలుపుగోలుగా మాట్లాడిన వారు ఇప్పుడు ఆ గ్రామస్థులు ఎదురైతేనే

బ్యాంకు, మార్కెట్, ఆస్పత్రి, ఇతర పనులకు ఎక్కడి వెళ్లినా అదో రకమైన చూపు
తూప్రాన్ రూరల్/మెదక్ (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ అంటేనే చుట్టు పక్కల గ్రామాల ప్రజ లు భయపడుతున్నారు. మొన్నటి వరకు కలుపుగోలుగా మాట్లాడిన వారు ఇప్పుడు ఆ గ్రామస్థులు ఎదురైతేనే మొహం చాటేస్తున్నారు. ఆగ్రామ ప్రజలను వెలివేసినట్టుగా చూస్తున్నారు. వారు చేసింది పెద్ద నేరమేమి కాదు... ఆ ఊరిలోని రెండు కుటుంబాలకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో అధికారులు వారిని హోం క్వారంటైన్‌లో ఉంచడం, గ్రామంలో కట్టుదిట్టమైన కట్టడి చేయడమే వారికి కష్టాలను తెచ్చిపెట్టింది.
20 రోజుల క్రితం ఆ గ్రామానికి చెందిన ఇద్దరు బాలింతలను ఇంటికి చేర్చిన అంబులెన్స్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్లు నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన అధికారులు రెండు కుటుంబాలకు చెందిన 17 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచారు. గత నెల 30 నుంచి వీరంతా ఇంటికే పరిమితమయ్యారు. ఆ గ్రామంలో ప్రజలు తిరగకుండా అధికా రులు కట్టడి చేశారు. అయితే పొరుగు గ్రామాల ప్రజలు ఆ గ్రామస్థులందరినీ క్వారంటైన్‌లో ఉన్న వారిగా చూస్తున్నారు. ఈ ఘటనతో ఇంటా బయట ఆ గ్రామస్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్కెట్‌కు, కంపెనీల్లో పనులకోసం వెళ్లినా కిష్టాపూర్ పేరు చెబితేనే ఓ రకంగా చూస్తున్నారు. బ్యాంకులకు వెళితే ఆంక్షలు విధిస్తున్నారు. 13 రోజుల నుంచి కిష్టాపూర్‌లో కరోనా కట్టడి కొనసాగుతోంది. గ్రామస్థులెవరూ బయటకు వెళ్లలేకపోతున్నారు. ఇక హోం క్వారంటైన్‌లో ఉన్న రెండు కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇంటి వద్దకే తెస్తున్నారు. కరోనా భయంతో ఆ రెండు ఇళ్ల వారిని కట్టడి చేయడం వల్ల ఆ గ్రామస్థులకు లేని సమస్యను తెచ్చిపెట్టింది. అధికారుల సూచనల మేరకు గ్రామంలో 2 రోజుల నుంచి కొన్ని నిబంధనలు సడలించారు. హోంక్వారంటైన్‌లో ఉన్న వారికి కరోనా లక్షణాలు లేవని తేలే వరకు గ్రామంలో కట్టడి కొనసాగుతుందని అఽధికారులు చెబుతున్నారు.