11 నెలల చిన్నారికి అనారోగ్యం.. హైదరాబాద్‌లో శస్త్రచికిత్స.. కరోనా టెస్ట్ చేస్తే..

ABN , First Publish Date - 2020-07-20T18:37:40+05:30 IST

సిద్దిపేట జిల్లాలో ఆదివారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. హుస్నాబాద్‌కు చెందిన ఓ మహిళ కరోనాతో కరీంనగర్‌ ఆస్పత్రిలో మృతి చెందింది. రంగనాయకసాగర్‌ పరిధిలోని

11 నెలల చిన్నారికి అనారోగ్యం.. హైదరాబాద్‌లో శస్త్రచికిత్స.. కరోనా టెస్ట్ చేస్తే..

సిద్ధిపేట జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌

హుస్నాబాద్‌లో మహిళ మృతి


సిద్దిపేట(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లాలో ఆదివారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. హుస్నాబాద్‌కు చెందిన ఓ మహిళ కరోనాతో కరీంనగర్‌ ఆస్పత్రిలో మృతి చెందింది. రంగనాయకసాగర్‌ పరిధిలోని ఏఈ కుటుంబీకుల్లో ఇద్దరికి, సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఒకరికి, ఇందిరానగర్‌లో ఒకరికి, పాములపర్తిలో ఒకరికి, రాయపోల్‌ మండలం బేగంపేటలో ఒకరికి పాజిటివ్‌గా వెల్లడైనట్లు సమాచారం. ఆదివారం 42మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా అందరికి నెగటివ్‌ వచ్చింది. కాగా ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌ ప్రకారం ఇకనుంచి ర్యాపిడ్‌ టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే గొంతుస్రావాల పరీక్ష చేయకుండా కరోనా కేసులుగానే పరిగణిస్తారు. ర్యాపిడ్‌ పరీక్షలో నెగటివ్‌ వచ్చి వ్యాధి లక్షణాలున్న వారికి మాత్రమే గొంతుస్రావాల పరీక్ష చేస్తారు.


పదకొండు నెలల చిన్నారికి కరోనా

రాయపోల్‌ మండలంలోని బేగంపేటలో పదకొండు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  మూడు రోజుల క్రితం చిన్నారి పేగు సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా తల్లిదండ్రులు మెదక్‌ జిల్లా తూప్రాన్‌లోని పిల్లల డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ డాక్టర్‌ సలహా మేరకు చిన్నారిని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారికి శస్త్రచికిత్స నిర్వహించిన అనంతరం కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. చిన్నారిని బేగంపేటకు తరలించి హోంఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కుటుంబసభ్యులు 8 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచి, గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.


కొండపోచమ్మసాగర్‌ నిర్మాణంలో పనిచేస్తున్న వ్యక్తికి

కొండపోచమ్మసాగర్‌లో పని చేస్తున్న ఐదుగురికి ఆదివారం పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా తేలింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ ఐదుగురు కొండపోచమ్మసాగర్‌ నిర్మాణ కాలువల్లో పని చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి(50)ని మర్కుక్‌ మండలం పాములపర్తిలో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు మర్కుక్‌ వైద్యాధికారి రవికుమార్‌ తెలిపారు.


కరోనాతో హుస్నాబాద్‌కు చెందిన మహిళ మృతి 

హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన ఓ మహిళ కరోనాతో కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందింది. ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో తమ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చింది. మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురైన మహిళను చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించింది. అయితే మృతి చెందిన మహిళ శవాన్ని బంధువులకు ఇవ్వటానికి వైద్యులు అంగీకరించకపోవడంతో వారు ఆందోళన చేసినట్లు సమాచారం. అయితే ఆమె కరోనాతో మృతి చెందినట్లు హుస్నాబాద్‌ వైద్యులు వెల్లడించారు.  


సిద్దిపేటలో స్వచ్ఛంద కట్టడి

సిద్దిపేట పట్టణంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు స్వచ్ఛంద బంద్‌ను అమలు చేశారు. కొత్త వేంకటేశ్వరాలయం నుంచి పాత వేంకటేశ్వరాలయం వరకు ఉన్న అన్ని దుకాణాలను ఈనెల19 నుంచి 31వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-07-20T18:37:40+05:30 IST