కరోనా వైరస్ లక్షణాలున్నాయన్న బెంగతో గుండెపోటు..!
ABN , First Publish Date - 2020-08-12T18:43:21+05:30 IST
జిల్లాలో కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన బులెటిన్ ప్రకారం తూప్రాన్ 9, శివ్వంపేట 3, పాపన్నపేట 4,

కొత్తగా 25 పాజిటివ్ కేసులు నమోదు
మెదక్ అర్బన్ (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన బులెటిన్ ప్రకారం తూప్రాన్ 9, శివ్వంపేట 3, పాపన్నపేట 4, రామాయంపేట 2, వెల్దుర్తి 2, మెదక్, చేగుంట, హవేళీఘణపూర్, కొల్చారం, టేక్మాల్‌లో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్-19 బారిన పడినట్లు తేలింది.
కొవిడ్-19 లక్షణాలతో వృద్ధురాలి మృతి
తూప్రాన్ పట్టణంలో వృద్ధురాలు (74) మంగళవారం కరోనా లక్షణాలతో మృతిచెందింది. నాలుగైదు రోజులుగా జ్వరం రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నది. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. స్కానింగ్‌లో ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
చేగుంటలో మరో వ్యక్తి..
జ్వరం, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి మృతిచెందిన సంఘటన అనంతసాగర్‌లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన ఒకరు ఐదురోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో మంగళవారం నార్సింగి ఆస్పత్రికి తరలించే లోపు మృతిచెందాడు.
వైరస్ లక్షణాలున్నాయన్న బెంగతో గుండెపోటు..
కొవిడ్-19 లక్షణాలతో మాజీ సర్పంచ్ (68) మృతిచెందిన సంఘటన మండలంలోని రంగాయిపల్లిలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం లక్ష్మక్కపల్లిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్-19 టెస్టు చేయించుకుని గ్రామానికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు.
నిజాంపేట: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంతోపాటు కల్వకుంట గ్రామంలో బుధవారం నుంచి 19 వరకు వారంరోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు గ్రామపంచాయతీ సర్పంచులు అనూష, కృష్ణవేణి, పాలకవర్గం సభ్యులు తెలిపారు. ఎవరైనా అతిక్రమిస్తే రూ.5 వేల జరిమానా ఉంటుందన్నారు.
చేగుంటలో 12 నుంచి 20 వరకు అన్ని వ్యాపార వాణిజ్య రంగాలు సంపూర్ణ బంద్ చేయాలని గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. దీంతో కిరాణా దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం ఎదుట యూరియా కోసం వచ్చిన రైతులు బారులుతీరారు.
మనోహరాబాద్: కాళ్లకల్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. వైద్య సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం జూలై 28 నుంచి ఈ నెల 8 వరకు గ్రామంలో 14 మందికి పాజిటివ్ వచ్చింది. 36 మందిని హోం క్వారంటైన్లో ఉంచారు. మహాలక్ష్మి స్టీల్స్, గ్లోస్టర్, జీకే, గ్లోబల్, సాగర్ ఏసియా తదితర పరిశ్రమల్లో కార్మికులు కరోనా బారినపడ్డారు. వీరికి వైద్య బృందం మందులు పంపిణీ చేస్తున్నారు. కేసులు పెరిగినా సంత కొనసాగించడంతో వైరస్ విస్తరిస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు.