సర్కారు శాఖల్లో కరోనా కలకలం.. ఉద్యోగుల్లో దడ

ABN , First Publish Date - 2020-07-14T18:03:41+05:30 IST

సిద్దిపేట జిల్లాలో కరోనా కలకలం రేపుతుంది. కాంటాక్టు కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లోనూ భయం అలుముకున్నది. ఒక్కొక్కటిగా అన్ని శాఖల ఉద్యోగులనూ వైరస్‌ అంటుకుంటున్నది

సర్కారు శాఖల్లో కరోనా కలకలం.. ఉద్యోగుల్లో దడ

ఇప్పటికే రెవెన్యూ, పోలీసు, వైద్యవిభాగాల్లో పాజిటివ్‌

తాజాగా వ్యవసాయశాఖపై ఎఫెక్ట్‌

ఏఈవో ద్వారా మరో ఇద్దరికి..

సిద్దిపేట జిల్లాలో 102 కేసులు నమోదు

తాజా పరిణామాలపై మంత్రి హరీశ్‌ దృష్టి


సిద్దిపేట(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలో కరోనా కలకలం రేపుతుంది. కాంటాక్టు కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లోనూ భయం అలుముకున్నది. ఒక్కొక్కటిగా అన్ని శాఖల ఉద్యోగులనూ వైరస్‌ అంటుకుంటున్నది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిణామాలపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. కరోనాను అదుపులోకి తెచ్చే చర్యల్లో నిమగ్నమయ్యారు. 


సిద్దిపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య సెంచరీ దాటింది. సోమవారం ఐదు కేసులు నమోదు కావడంతో మొత్తంగా 102 కేసులకు చేరింది. దాదాపు రెండు నెలలపాటు గ్రీన్‌జోన్‌లో ఉన్న సిద్దిపేట జిల్లాలో కేవలం నెలరోజుల వ్యవధిలోనే విస్తృతంగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. 


ఉద్యోగుల్లో దడ

కరోనా లక్షణాలు ఉన్నవారికి సేవలందించిన సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు వైద్యులకు వైరస్‌ సోకింది. మద్దూరు మండలంలో ఓ వీఆర్వోకూ అంటుకుంది. పోలీస్‌శాఖలోనూ ముగ్గురికి ఇటీవల పాజిటివ్‌గా తేలింది. గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో కూడా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రచారం జరిగింది. గజ్వేల్‌ డివిజన్‌లోని సాగునీటి శాఖలోనూ ఒకరికి కరోనా వచ్చినట్లు సమాచారం. చేర్యాల మండలంలో ఓ బ్యాంకు మేనేజర్‌కు, తొగుట మండలంలో ఓ విద్యుత్‌ ఉద్యోగికీ పాజిటివ్‌గా తేలింది. వీరంతా కూడా నిరంతరం  ప్రజల మధ్యే ఉండేవారు. నిత్యం తమతోపాటే తిరిగేవారికి పాజిటివ్‌ రావడంతో సహచర ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.  


వ్యవసాయశాఖలోనూ..

విధి నిర్వహణలో ఉన్న కొండపాక మండల ఏఈవోకు కరోనా సోకినట్లుగా నిర్ధారించారు. ఆమె ఇద్దరు స్నేహితురాళ్లకు కూడా రిపోర్టుల్లో పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిసింది.  వ్యవసాయశాఖకు చెందిన మరో ఐదుగురు ఉద్యోగులు కూడా ఇటీవల ఆమెతో కలిసి ఓ సర్వేలో పాల్గొన్నట్లు సమాచారం. వారిలో ఒకరిద్దరికి లక్షణాలున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరి రిపోర్టు రావాల్సి ఉంది. సదరు ఏఈవో ఇటీవల కొండపాక మండలంలోని పలు కార్యాలయాలకు విధి నిర్వహణలో భాగంగా వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. ఎక్కడెక్కడకు వెళ్లారో ఆ కాంటాక్టు వ్యక్తులను ఆరా తీస్తున్నారు. 


మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి

జిల్లాలో కేసుల సంఖ్య పెరగడం, ఉద్యోగవర్గాల్లో నెలకొన్న ఆందోళనపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టిసారించారు. సంబంధిత ఉద్యోగులు పనిచేసే శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ప్రతీ సమీక్షలోనూ తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో గల ఐసోలేషన్‌ కేంద్రాన్ని పర్యవేక్షించారు. కొవిడ్‌ పరీక్షా కేంద్రాన్ని కూడా ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ప్రతి మీటింగ్‌లోనూ కరోనా రాకుండా తీసుకోవాల్సినజాగ్రత్తల గురించి తనదైన శైలిలో  ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

Updated Date - 2020-07-14T18:03:41+05:30 IST