కరోనా దెబ్బతో రూ. 200 కోట్లు నష్టం

ABN , First Publish Date - 2020-04-05T10:19:22+05:30 IST

అసలే నీటి కొరత.. ఆపై కరోనా దెబ్బ.. ఫలితంగా సంగారెడ్డి జిల్లాలోని ఆరు బీరు

కరోనా దెబ్బతో రూ. 200 కోట్లు నష్టం

లాక్‌డౌన్‌తో నిలిచిన బీర్ల ఉత్పత్తి

సంగారెడ్డి జిల్లాలో ఆరు పరిశ్రమలు మూత

రాష్ట్ర ప్రభుత్వ రాబడికి గండి


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్‌ 4 : అసలే నీటి కొరత.. ఆపై కరోనా దెబ్బ.. ఫలితంగా సంగారెడ్డి జిల్లాలోని ఆరు బీరు పరిశ్రమలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల ఎక్సైజ్‌ ఆదాయం కోల్పోయింది. సంగారెడ్డి జిల్లాలో ఆరు బీరు పరిశ్రమలున్నాయి. గతేడాది మార్చి నెలలో 40 లక్షల కేసుల బీరు అమ్ముడవగా, ఈ ఏడాది లాక్‌డౌన్‌కు ముందు వరకు 20 లక్షల కేసుల బీరు సీసాలే అమ్ముడయ్యాయి. మంజీరా నది ఎండిపోవడంతో తీవ్రమైన నీటి ఎద్దడితో పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించాయి. ఈ పరిస్థితుల్లోనే కరోనా దెబ్బతో ఈ నెల 22 నుంచి ఉత్పత్తి పూర్తిగా నిలిపివేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నెలాఖరు వరకు పరిశ్రమలను తెరిచే పరిస్థితులు లేవు. 


రూ.200 కోట్ల నష్టం

బీరు కంపెనీలు ఒక్కో సీసాను రూ.30 చొప్పున ప్రభుత్వానికి ఇవ్వగా.. బహిరంగ మార్కెట్‌కు చేరేసరికి బ్రాండ్‌ను బట్టి ఒక్కో సీసా ధర రూ.90 నుంచి రూ.110 వరకు ఉంటుంది. గతేడాదితో పోల్చితే ఒక్క నెలలోనే ఇరవై లక్షల కేసుల బీరు అమ్మకాలు పడిపోవడంతో ప్రభుత్వానికి రూ.200 కోట్ల ఆదాయం తగ్గిపోయింది.


ఆర్వో ప్లాంట్ల ఆదాయానికి గండి

మంజీరా నది ఎండిపోవడంతో బీరు కంపెనీలు నీటి కోసం ఆర్వో ప్లాంట్లపై ఆధారపడుతున్నాయి. జిల్లాలోని ఆరు బీరు పిశ్రమలకు రోజుకు 300 ట్యాంకర్ల నీటిని ఆర్వో ప్లాంట్లు సరఫరా చేస్తున్నాయి. ఖర్చులన్నీ పోనూ ఒక్కో ట్యాంకర్‌కు రూ. మూడు వేల ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఆర్వో ప్లాంట్ల యజమానులు ప్రతిరోజూ రూ. 9 లక్షల ఆదాయాన్ని కోల్పోతున్నారు.

Updated Date - 2020-04-05T10:19:22+05:30 IST