కరోనా కల్లోలం!
ABN , First Publish Date - 2020-05-29T10:30:05+05:30 IST
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది.

ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్
భయాందోళనలో వెంకట్రావ్పేట, చందాపూర్ ప్రజలు
చందాపూర్‌లో 12 కుటుంబాలకు హోం క్వారంటైన్
తొగుట, మే 28: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ముంబై నుంచి వెంకట్రావ్‌పేటకు వచ్చిన దంపతులకు మొదట పాజిటివ్ రాగా వారి కుటుంబానికి చెందిన మరో మహిళకు కూడా కరోనా సోకింది. దీంతో అధికారులు గ్రామాన్ని కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. గ్రామంలో వ్యాధి ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు, హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని చాటింపు వేయించారు. గ్రామం నుంచి ఎవరిని బయటకు వెళ్లకుండా, ఇతర ప్రాంతాల నుంచి గ్రామంలోకి రాకుండా పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
ఎవరిని కలిశారో ఆరా తీస్తున్న వైద్యాధికారులు
కాగా పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారో వైద్యసిబ్బంది ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆరుగురిని గుర్తించి సిద్దిపేట ఐసోలేషన్ వార్డుకు తరలించి పరీక్షలు చేయించారు. వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. మిగిలిన ఐదుగురికి నెగటివ్ రిపోర్టు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామంలో వైద్యసిబ్బంది 20 టీంలుగా ఏర్పడి, ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వారి వయస్సును నమోదు చేస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ ముజాంహిల్ఖాన్, జిల్లా వైద్యాధికారి మనోహర్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గ్రామంలో పర్యటించి, ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
నలుగురి గొంతుస్రావాలు సేకరణ
10 రోజుల క్రితం వెంకట్రావ్పేట గ్రామానికి చెందిన ముగ్గురితో కలిసి ముంబై నుంచి ఒకే వాహనంలో తొగుటకు చెందిన నలుగురు వచ్చారు. వారి గొంతుస్రావాలు, రక్తనమూనాలను గురువారం వైద్యసిబ్బంది సేకరించారు. వారిలో ఒకరు క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు.
భయాందోళనలో రెండు గ్రామాల ప్రజలు
కరోనాతో వెంకట్రావ్పేట, చందాపూర్ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాజిటివ్ వచ్చిన వెంకట్రావ్పేట గ్రామానికి చెందిన మహిళ వారం క్రితం చందాపూర్ గ్రామానికి వెళ్లింది. గురువారం పోలీసులు, వైద్యసిబ్బంది చందాపూర్ గ్రామానికి వెళ్లి, సదరు మహిళ ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యిందో ఆరా తీశారు. 12 కుటుంబాలను ఆమె కలిసినట్లు గుర్తించి, వారిని హోం క్వారంటైన్లో ఉంచారు.
మెదక్ జిల్లాలో 132 మందికి క్వారంటైన్ పూర్తి
మెదక్ అర్బన్: మెదక్ జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 132 మందికి క్వారంటైన్ గడువు పూర్తయిందని జిల్లా సర్వేలైన్ అధికారి డాక్టర్ నవీన్‌కుమార్ గురువారం తెలిపారు. ఇంకా 421 మంది హోం క్వారంటైన్లో ఉన్నారని ఆయన వెల్లడించారు.