మక్కలు కొనే దిక్కులేదు

ABN , First Publish Date - 2020-03-18T11:36:10+05:30 IST

రబీ సీజన్‌ మొక్కజొన్న పంట చేతికొచ్చే దశలో ధర దారుణంగా దెబ్బతిన్నది. కనీస మద్దతు ధరకంటే దిగజారింది. కొత్తవి మార్కెట్లోకి వచ్చేసరికి పరిస్థితి ఎలా

మక్కలు కొనే దిక్కులేదు

కరోనా ప్రభావంతో కుదేలైన పౌలీ్ట్ర 

జిల్లాలో 31,034 ఎకరాల్లో మొక్కజొన్న సాగు 

దిగుబడి అంచనా 9 లక్షల క్వింటాళ్లు

డిమాండ్‌ లేక క్షీణించిన ధరలు

నూకలు, పరం, సోయాబీన్‌ ధరలు కూడా పతనం


సిద్దిపేట/అగ్రికల్చర్‌, మార్చి 17: రబీ సీజన్‌ మొక్కజొన్న పంట చేతికొచ్చే దశలో ధర దారుణంగా దెబ్బతిన్నది. కనీస మద్దతు ధరకంటే దిగజారింది. కొత్తవి మార్కెట్లోకి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌ ప్రచారం ప్రభావంతో పౌలీ్ట్ర పరిశ్రమ దెబ్బతినగా, కోళ్ల దాణాకు అవసరమైన మొక్కజొన్నల ధర పడిపోయింది. దానితో పాటు వరి ఉత్పత్తులైన నూకలు, పరం, సోయాబిన్‌ కేక్‌ ధరలు దిగజారాయి.


సాధారణం కంటే పెరిగిన సాగు

రబీ సీజన్‌లో జిల్లాలో మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం సాధారణ కంటే ఎక్కువగానే నమోదయింది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 28, 213 ఎకరాలుండగా, ఈసారి రైతులు 31,034 ఎకరాల్లో పంట వేశారు. సాధారణంగా మొక్కజొన్న ఎకరాకు సరాసరి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. అంటే సుమార ు9,31,020  క్వింటాళ్ల దిగుబడి రానున్నది. ప్రస్తుతం ఈ పంట కోతకు వచ్చింది. పదిహేను రోజుల్లో పెద్దమొత్తంలో మక్కలు మార్కెట్‌కు అమ్మకానికి వస్తాయి. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,760గా ప్రకటించింది. పలువురు రైతులు మొక్కజొన్న కోతలు ఊర్తయినా ధరలు క్షీణించడంతో చేనులోనే పంటను జూళ్లుగా పెట్టుకున్నారు. 


కరోనా ప్రభావంతో కుదేలు

కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్రంలో పౌలీ్ట్ర పరిశ్రమ అనూహ్యంగా దెబ్బతిన్నది. బ్రాయిలర్‌ కోళ్లను కొనేవారు కరువయ్యారు. కిలో పాతిక రూపాయలకిస్తామన్నా వద్దు పొమ్మంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోళ్లను మేపలేక ఉచితంగా పంచిపెడుతున్నారు. కోడిగుడ్ల అమ్మకాలూ పడిపోయాయి. బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలు క్రమంగా మూతపడ్తున్నాయి. బ్రీడర్‌, లేయర్‌ కోళ్ల ఫారాల్లోనూ కోళ్ల పెంపకం తగ్గించారు. జిల్లాలో 18 బ్రీడర్‌ పౌల్ర్టీ ఫారాలు, 45 లేయర్‌ ఫారాలుండగా, బ్రాయిలర్‌ ఫారాలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. సాఽధారణంగా బ్రాయిలర్‌ ఫారాల్లో, బ్రీడర్‌ ఫారాల్లో కోళ్లకు వేసే దాణాలో 60 శాతం, లేయర్‌ ఫారాల్లో ఉపయోగించే దాణాలో 45 శాతం మొక్కజొన్నలనే వినియోగిస్తారు. జిల్లాలోని కోళ్ల ఫారాల యజమానులు కరోనా ఎఫెక్ట్‌కు ముందు రోజుకు సుమారు 485 మెట్రిక్‌టన్నుల మొక్కజొన్నలు దాణాగా వినియోగించేవారని అంచాన.


ప్రస్తుతం రోజుకు 290 మెట్రిక్‌ టన్నులు మాత్రమే వినియోగిస్తున్నారు. క్రమంగా ఇది మరింత తగ్గే అవకాశాలున్నాయి. గతంలో కోళ్ల ఫారాలకు మొక్కజొన్నల విక్రయమంటే బ్రోకర్లు, అమ్మకందారులు సంతోషంగా ముందుకొచ్చేవారు. వారం పదిరోజులు ఉద్దఎర ఇవ్వమన్నా ఒప్పుకునేవారు. పౌల్ర్టి రంగం దెబ్బతినడంతో ఆ రంగంలో అరువు ఇవ్వడానికి ఎవరూ ముందుకురావడం లేదు. ఈ నేపథ్యంలో మొక్కజొన్న ధర దారుణంగా పడిపోయింది. గత సంవత్సరం ఇదే సీజన్‌లో మొక్కజొన్నల కనీస మద్దతు ధర రూ.1,740లు ఉండగా, బహిరంగ మార్కెట్‌లో  రూ.1,800 నుంచి 2,200 వరకు ధర పలికింది. కరోనా ప్రభావానికి ముందు మొక్కజొన్నల ధర క్వింటాలుకు రూ. 2 వేలుండేది. నెలన్నర కాలంలోనే ధరలు భారీగా తగ్గిపయి క్వింటాళు రూ.1,500ల నుంచి 1,600లకు ఇస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్‌ మొక్కజొన్న పంట మరో 15 రోజుల్లో మార్కెట్‌కు వస్తుంది. కరోనా ప్రభావం ఇలాగే కొనసాగితే ధరలు మరింత పడిపోయే ప్రమాదమున్నది. 


నూకలు, పరం, సోయా ధరలు కూడా

పౌల్ర్టీల్లో కోళ్ల పెంపకానికి మొక్కజొన్నతో పాటు బియ్యం నూకలు, పరం వినియోగిస్తారు. ఇవి పదిశాతం దాకా దాణాగా వాడుతారు. సోయాబిన్‌ కేక్‌ 20శాతం దాకా ఉపయోగిస్తారు. ఇటీవల వీటి ధరలు కూడా పడిపోయాయి. నూకలు, పరం క్వింటాలుకు రూ.ఐదు వందల దాకా ధర తగ్గింది. సోయాబీన్‌ కేక్‌ కిలోకు రూ.19 నుంచి దిగజారి 10 రూపాయలైంది. మొత్తంపై కరోనా పరోక్ష ప్రభావం వల్ల రైతులు పండించిన పంటల ధరలు తగ్గుతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తున్నది. 

Updated Date - 2020-03-18T11:36:10+05:30 IST