కుల బహిష్కరణ చేసిన వారిపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-12-20T05:23:52+05:30 IST
కుల బహిష్కరణ చేసి తాము జీవనోపాధిని కోల్పోయేలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జప్తినాచారం గ్రామానికి చెందిన పలువురు గౌడ కులస్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్‌ను శనివారం కలిసి ఫిర్యాదు చేశారు.

మానవ హక్కుల కమిషనర్‌ను కలిసిన జప్తి నాచారం గౌడ కులస్థులు
కొండపాక, డిసెంబరు 19: కుల బహిష్కరణ చేసి తాము జీవనోపాధిని కోల్పోయేలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జప్తినాచారం గ్రామానికి చెందిన పలువురు గౌడ కులస్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్‌ను శనివారం కలిసి ఫిర్యాదు చేశారు. జప్తి నాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ మల్లేశం, వడ్లకొండ శ్రీధర్, స్వామిగౌడ్, చింతల రమే్‌షగౌడ్, వడ్ల మల్లిఖార్జున్‌గౌడ్, వడ్లకొండ రమే్‌షగౌడ్, వడ్లకొండ రవీందర్‌గౌడ్ మానవ హక్కుల కమిషనర్‌ను కలిశారు. గ్రామంలో ఈత, తాటి చెట్లు పంచుకునే విషయంలో అక్టోబరు 4న చింతల ఆంజనేయులు, పరశరాములు, సంతోష్, కిష్టయ్య, రవి, ప్రవీణ్, బాబు, రాజుగౌడ్ తమతో గొడవపడి దాడి చేశారని చెప్పారు. కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు నమోదు చేశారన్నారు. దీంతో తమపై కక్ష పెంచుకుని కుల పెద్దలతో కలిసి తాము పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారని ఆరోపించారు. వెనక్కి తీసుకోకపోవడంతో తమ వంతుగా వచ్చే తాటి, ఈత చెట్లను పంచకుండా, తమను కుల బహిష్కరణ చేశారని తెలిపారు. తమ కులస్థులెవరైనా మాట్లాడితే జరిమానా వేస్తామని హెచ్చరించారని పేర్కొన్నారు. పూర్తి విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు.