వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణంలో వేగం పెంచాలి : కలెక్టర్

ABN , First Publish Date - 2020-03-12T08:16:04+05:30 IST

గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నెలాఖరులోగా అందుబాటులోకి తేవాలని మెదక్‌

వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల  నిర్మాణంలో వేగం పెంచాలి : కలెక్టర్

మెదక్‌ రూరల్‌, మార్చి 11: గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నెలాఖరులోగా అందుబాటులోకి తేవాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉపాధి హామీ పనులు, ఇతర అంశాలపై మండల ఏపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికీ వైకుంఠధామం, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలు ప్రారంభం కాని గ్రామాల్లో ఎందుకు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆయా గ్రామాల్లో పనులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.


ఉపాధిహామీ నిధుల ద్వారా గ్రామాల్లో చేపట్టే పనులను సైతం నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. నాణ్యతలోపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమ్మె నేపథ్యంలో ఉపాధి పనుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోజు వారిగా చేపట్టే పనులపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించాలని సూచించారు. పనుల నిర్వహణలో సమస్యలు ఉత్పన్నం కాకుండా పంచాయతీ కార్యదర్శులకు సహకారం అందించాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉమాదేవితో పాటు ఏపీవోలు, అధికారులు ఉన్నారు. 

Updated Date - 2020-03-12T08:16:04+05:30 IST