ఆలయ స్థలంలో అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ సీరియస్
ABN , First Publish Date - 2020-02-08T11:17:17+05:30 IST
సంగారెడ్డిలోని రాజంపేటలో గల రాజరాజేశ్వర ఆలయ స్థలంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించిన అధికారులపై జిల్లా కలెక్టర్

సంగారెడ్డి టౌన్: సంగారెడ్డిలోని రాజంపేటలో గల రాజరాజేశ్వర ఆలయ స్థలంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించిన అధికారులపై జిల్లా కలెక్టర్ హన్మంతరావు అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఆలయ స్థలంలో అక్రమ నిర్మాణాలు’’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసి, నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలయ ఇనాం భూమిలో గుండం పక్కనే నిర్మించిన ఇంటిని కూల్చివేసేందుకు రెవెన్యూ, మున్సిపల్, అధికారులు ఎక్స్‌కవేటర్‌తో వెళ్లి హడావిడి చేశారు. తాము పట్టాభూమిలోనే ఇల్లును నిర్మించుకున్నామంటూ ఆ ఇంటి యజమాని కొన్ని పత్రాలను రెవెన్యూ అధికారులకు చూపించినట్టు తెలిసింది. అయితే ఆలయ భూమికి సంబంధించిన 283, 284 సర్వే నంబర్ల పక్కనే ఓ వ్యక్తి పేరిట పట్టా సర్వే నంబర్ 285 ఉన్నట్టు తెలిసింది. గుండం పక్కన బఫర్ జోన్ స్థలంలో ఇల్లును నిర్మించినట్టు అధికారులు అంచనా వేశారు. ఈ ఇల్లు నిర్మాణం కోసం మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. అయితే.. ఆలయ స్థలంలో నిర్మించారా లేదా నిర్దారించేదుకు ఇరిగేషన్ శాఖ అధికారులను సైతం తహసీల్దార్ స్వామి పిలిపించారు. ఇరిగేషన్ డీఈ సురేశ్ అక్కడకు వెళ్లి ఇల్లు నిర్మాణం చేసిన స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న ఇంటికి విద్యుత్ శాఖ కరెంటు మీటర్‌ను కేటాయించడంపై సంబంధిత అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇంటిని ఆలయ స్థలంలోనా లేక ప ట్టాభూమిలో నిర్మించారా? తేల్చే పనిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిమ గ్నమయ్యారు.