పరవశించి.. ప్రశంసించి.. ఐదు గంటలున్న సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-12-11T06:14:05+05:30 IST

పర్యటిస్తూ.. పరవశిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట ప్రాంతంలో కలియతిరిగారు. 2017 అక్టోబరు తర్వాత అధికారికంగా ఆయన పర్యటించడంతో పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ ఉత్సాహం కనిపించింది.

పరవశించి.. ప్రశంసించి.. ఐదు గంటలున్న సీఎం కేసీఆర్‌
డబుల్‌ బెడ్రూం కాలనీలో ఏర్పాటు చేసిన ఫైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌


సిద్దిపేటకు వరాల జల్లు

ఎయిర్‌పోర్టు ప్రకటనతో జోష్‌

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లోనూ ఉత్సాహం

మంత్రి, కలెక్టర్‌పై ప్రశంసలు

ప్రశాంతంగా సాగిన ముఖ్యమంత్రి టూర్‌


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 10 : పర్యటిస్తూ.. పరవశిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట ప్రాంతంలో కలియతిరిగారు. 2017 అక్టోబరు తర్వాత అధికారికంగా ఆయన పర్యటించడంతో పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ ఉత్సాహం కనిపించింది. ఐదు గంటల పాటు సుదీర్ఘంగా తన పర్యటనను కొనసాగించడం, సిద్దిపేట పుర వీధుల గుండా తన కాన్వాయ్‌ ముందుకు సాగడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తమ అభిమాన నేతను చూసి ఆనంద పరవశులయ్యారు. 

సిద్దిపేటలో కేసీఆర్‌ టూర్‌ విజయవంతమైంది. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల దాకా సాగిన ఆయన పర్యటన ప్రశాంతంగా ముగిసింది. దీంతో మంత్రి హరీశ్‌రావుతోపాటు కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, సీపీ జోయల్‌ డేవిస్‌, ఇతర అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన పర్యటనలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం హాల్‌లో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తల వద్దకు కేసీఆర్‌ వచ్చి తనకు పరిచయం ఉన్న నాయకులను పేరుపేరునా పలకరించారు. ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నారు.  


ఎయిర్‌పోర్ట్‌.. వరాల జల్లుతో జోష్‌

సిద్దిపేట ప్రాంతంలో ఒక్క విమానం తప్ప అన్ని వసతులు ఉన్నాయని రెండు రోజుల క్రితమే మంత్రి హరీశ్‌రావు ఓ సమావేశంలో చెప్పారు. అసాధ్యమనుకున్న ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో బయటపెట్టారు. సిద్దిపేట ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటయ్యే సూచనలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు. దీంతో ఈ ప్రాంత ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక సిద్దిపేటకు మరో వెయ్యి డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కవులు, కళాకారులకు కేంద్రంగా ఉన్న సిద్దిపేటలో 2 వేల మందికి సరిపడా అద్భుతమైన ఆడిటోరియానికి రూ.50 కోట్లు, ఇర్కోడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.80 కోట్లను ప్రకటించారు. సిద్దిపేట నుంచి ఇల్లంతకుంటకు ఫోర్‌లేన్‌ రోడ్డు, రాజీవ్‌ రహదారి టు రాజీవ్‌ రహదారికి 75 కిలోమీటర్ల రింగురోడ్డును మంజూరు చేశారు. కోమటిచెరువు అభివృద్ధికి రూ.25 కోట్లను,  రంగనాయకసాగర్‌ పర్యాటక రంగం కోసం రూ.100 కోట్లను ప్రకటించారు. అదే విధంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో బస్తీ దవాఖాన, సిద్దిపేటలో త్రీ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ కోసం అనుమతి ఇచ్చారు.


కలెక్టర్‌పై ప్రశంసలు

సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి దండివాడు, మొండివాడు, గొప్పవాడు అంటూ సీఎం కేసీఆర్‌ పొగడ్తలతో ముంచెత్తారు. మీ జిల్లాకు గొప్ప కలెక్టర్‌ ఉన్నాడంటూ ప్రశంసించారు. మంత్రి హరీశ్‌రావుతో కలిసి సిద్దిపేట పట్టణానికి ప్రత్యామ్నాయంగా నర్సాపూర్‌లో అద్భుత పట్టణాన్ని సృష్టించాడని అన్నారు. గజ్వేల్‌లో కూడా 6 వేల ఇళ్లను నిర్మించే బాధ్యతను తీసుకున్నారని చెప్పారు. కలెక్టర్‌ను మనస్ఫూర్తిగా ఆశీర్వాదిస్తున్నా అంటూ కేసీఆర్‌ ప్రశంసించారు.  


హరీశ్‌ను హత్తుకున్న కేసీఆర్‌

తన మేనల్లుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే మంత్రి హరీశ్‌రావును సీఎం కేసీఆర్‌ వేదికపై ఆప్యాయంగా హత్తుకున్నారు. సిద్దిపేటలో పర్యటిస్తుంటే పరవశించిపోయానని, తన కలలను నెరవేర్చడంలో హరీశ్‌ సఫలమయ్యాడని పదేపదే తెలిపారు. సీఎం కేసీఆర్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు లోటుపాట్లు లేకుండా మంత్రి హరీశ్‌రావు అన్నీతానై వ్యవహరించారు. కార్యక్రమాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు. భారీగా జనసమీకరణ చేసి బహిరంగ సభను విజయవంతం చేశారు. 


భారీగా హాజరైన ప్రజలు

సిద్దిపేట టౌన్‌, డిసెంబరు 10 : చాలా కాలం తర్వతా సిద్దిపేటకు సీఎం కేసీఆర్‌ రావడంతో ఆయనను చూసేందుకు ప్రజలు, అభిమానులు ఆసక్తి కనబరిచారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభకు ప్రజలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. సభకు వచ్చే వారికి అధికారులు పాస్‌లను మంజూరు చేశారు. సభ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆందరినీ ఆకట్టుకున్నాయి. సభా ప్రాంగణంలోకి సీఎం కేసీఆర్‌ రాగానే అందరూ నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. సభలో జై తెలంగాణ, జై కేసీఆర్‌ నినాదాలు మార్మోగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగంలో ప్రారంభోత్సవానికి రావాలని పిలిచి మెల్లగా సభలో నిధులు కావాలని అడుగుతున్నాడని, హరీశ్‌ చాలా హుషారు అనగా, నిధులు మంజూరు చేస్తారా అని సంబంధిత మంత్రులను అడగగా సభలో అందరూ నవ్వారు. 



Updated Date - 2020-12-11T06:14:05+05:30 IST