చేర్యాల డివిజన్‌ మళ్లీ తెరపైకి!

ABN , First Publish Date - 2020-07-19T05:39:42+05:30 IST

చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలన్న దశాబ్దాల ఆకాంక్ష మళ్లీ తెరపైకి...

చేర్యాల డివిజన్‌ మళ్లీ తెరపైకి!

  • కొత్త మండలంగా ధూలిమిట్ట?
  • జోగిపేట, వేములవాడ ఏర్పాటు నేపథ్యంలో చిగురిస్తున్న ఆశలు
  • డివిజన్‌ కోసం కొనసాగుతున్న ఆందోళనలు
  • ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని వేడుకోలు
  • పనుల కోసం మూడు డివిజన్లకు పరుగులు
  • అవస్థలు తీర్చాలంటూ స్థానికుల విన్నపాలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూలై18 : చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలన్న దశాబ్దాల ఆకాంక్ష మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రతీసారి ఎన్నికల హామీగానే మిగిలిపోతున్నా  తాజా పరిణామాలతో ఒకింత ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా అందోల్‌-జోగిపేట,  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడను రెవెన్యూ డివిజన్లుగా ప్రభుత్వం  ప్రకటించింది. ఈ క్రమంలో చేర్యాల విషయంలోనూ కీలక  ప్రజాప్రతినిధులు చొరవ చూపాలనే వాదనలు మిన్నంటాయి. రెవెన్యూ డివిజన్‌ సాధన సమితి జేఏసీ నేతలు సైతం శుక్రవారం  ఆందోళన బాటపట్టారు. 


 ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న చేర్యాల మండలాన్ని జనగామ నియోజకవర్గంలో విలీనం చేశారు. దీంతో కొంత ఉనికి కోల్పోయింది. జిల్లాల విభజన సమయంలో ఈప్రాంతం సిద్దిపేట జిల్లాలో కలిసింది. ఇటీవల మున్సిపాలిటీ హోదా కూడా దక్కింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావన రాగానే చేర్యాల పేరు ప్రథమంగా వినిపిస్తుంది. అర్హతలు ఉన్న చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేయాలనే ఆకాంక్ష బలంగా నాటుకుంది. ఇదే విషయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మదిలోనూ ఉన్నట్లుగా పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా ప్రస్తావించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సైతం గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల దీక్ష చేపట్టారు. ఈ పరిణామాలతో పాటు కొత్త డివిజన్లను ఏర్పాటు చేస్తుండడంతో మరొక్కసారి ప్రజాప్రతినిధులంతా చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు మినహాయిస్తే ఇక భవిష్యత్తులో ప్రశ్నార్థకమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


 గందరగోళంగా శాఖల పంపకం

జిల్లాల విభజన సమయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలు సిద్దిపేటలో విలీనమయ్యాయి. ఈ మూడు మండలాల పోలీసుశాఖను హుస్నాబాద్‌ డివిజన్‌కు అప్పగించారు. చేర్యాల, కొమురవెల్లి రెవెన్యూ విభాగాలను సిద్దిపేట డివిజన్‌కు, మద్దూరు మండలాన్ని హుస్నాబాద్‌కు కేటాయించారు. ఇక వ్యవసాయశాఖ పరంగా చూస్తే మూడు మండలాలను గజ్వేల్‌ డివిజన్‌కు విభజించారు. విద్యుత్‌ యంత్రాంగం కూడా హుస్నాబాద్‌ డివిజన్‌ కేంద్రంగానే నడుస్తోంది. ఇక మూడు మండలాల న్యాయవ్యవస్థ జనగామ పరిధిలో ఉంది. ఇలా ఒక్కో శాఖ ఒక్కో డివిజన్‌కు అప్పగించడంతో గందరగోళంగా ఉంది. రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైతేనే అన్ని శాఖలు ఒకేచోట ఉంటాయనే వాదన వినిపిస్తోంది.  


ధూలిమిట్ట మండలానికీ గ్రీన్‌సిగ్నల్‌?

 చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలన్న దశాబ్దాల ఆకాంక్ష మళ్లీ తెరపైకిమద్దూరు మండలంలో ఉన్న ధూలిమిట్ట గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిసింది. మద్దూరు మండలంలో 23 గ్రామాలుండగా 13 గ్రామాలతో ధూలిమిట్ట కొత్త మండలంగా ప్రకటించనున్నారనే చర్చ జరుగుతోంది. మద్దూరు, చేర్యాల, కొమురవెల్లి, ధూలిమిట్ట నాలు గు మండలాలతో కలిసి చేర్యాల రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. 


ప్రజల ఆకాంక్షను గుర్తించకపోవడం తగదు 

- కాటం శ్రీధర్‌, చేర్యాల రెవెన్యూ డివిజన్‌ జేఏసీ కో-కన్వీనర్‌  

చేర్యాల అస్తిత్వ పరిరక్షణకు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు అయ్యే అన్ని అర్హతలున్నా కూడా కుక్కలు చింపిన విస్తరిలా మార్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నరు. చేర్యాల కంటే చిన్నప్రాంతాలను ఇప్పటికే రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.  చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లోని అన్ని గ్రామపంచాయతీలు తీర్మానం చేసి ప్రభుత్వానికి అందించడంతో పాటు ఏడాదిన్నర కాలంగా  అన్నివర్గాలు ఆందోళన చేస్తున్నా గుర్తించకుండా అన్యాయం చేస్తున్నరు. 


ఒక్కో ప్రభుత్వ శాఖ ఒక్కో డివిజన్‌లో

- రామగళ్ల నరేశ్‌, చేర్యాల

 కొత్త జిల్లాల ఏర్పాటుతో చేర్యాలను విచ్ఛిన్నం చేశారు. ఒక్కో ప్రభుత్వశాఖ పనులకు గజ్వేల్‌, సిద్దిపేట, హుస్నాబాద్‌ డివిజన్‌కు, కోర్టుకు జనగామకు పోవాల్సివస్తుండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నం. రాజకీయ మనస్పర్థల కారణంగా చేర్యాల ప్రజలను బలి చేస్తున్నరు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినందుకు చేర్యాలపై చిన్నచూపు చూస్తుండటం సరికాదు. ఎన్నికల ముందు డివిజన్‌ అవుతుందని హామీ ఇస్తరు. కానీ ఆచరణలో మాత్రం పెట్టడం లేదు. చేర్యాల ప్రజల మనోభీష్టం మేరకు రెవెన్యూ డివిజన్‌ చేసి కష్టాలు తీర్చాలి.

Updated Date - 2020-07-19T05:39:42+05:30 IST