దుబ్బాక నుంచే మార్పు మొదలవ్వాలి

ABN , First Publish Date - 2020-10-13T07:24:18+05:30 IST

నాలుగు కోట్ల ప్రజల భవితను ఈ ఉప ఎన్నిక నిర్ధేశించబోతున్నదని, రాష్ట్రంలో మార్పు దుబ్బాక నుంచే మొదలు కావాలని

దుబ్బాక నుంచే మార్పు మొదలవ్వాలి

నాలుగు కోట్ల ప్రజల బతుకులు మారాలంటే టీఆర్‌ఎస్‌ ఓడాలి

లింగన్నకు మంత్రి పదవి ఎందుకివ్వలే ?

తీసేసిన తహసీల్దార్‌లా మంత్రి హరీశ్‌రావు పరిస్థితి

బీజేపీలో తప్పుచేసిన వారికి టిక్కెట్‌ ఇవ్వడం దుర్మార్గం

కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి


మిరుదొడ్డి, అక్టోబరు 12 : నాలుగు కోట్ల ప్రజల భవితను ఈ ఉప ఎన్నిక నిర్ధేశించబోతున్నదని, రాష్ట్రంలో మార్పు దుబ్బాక నుంచే మొదలు కావాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతన్న కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఇటీవల బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన తోట కమలాకర్‌రెడ్డిని మిరుదొడ్డిలోని ఆయన ఇంటికి వెళ్లి రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీలు కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, రాజయ్య సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో నిబద్ధతతో పనిచేసిన కమలాకర్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించి, తప్పు చేసిన వారికి టిక్కెట్‌ ఇవ్వడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్‌ పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులను కట్టబెట్టి, తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేశారని మండిపడ్డారు. పెళ్లి నుంచి చనిపోయే నాటి దాకా తోడున్నామని చెప్పే మీరు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన దివంతగ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి ఎందుకు మంత్రిపదవి ఇవ్వలేదని ప్రశ్నించారు.


దుర్మార్గులకు మంత్రి పదవులకు కట్టబెట్టారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రి హరీశ్‌రావు పరిస్థితి తీసేసిన తహసీల్దార్‌ లాగా మారిందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న రోజే పండుగని, తర్వాత దండుగని ఎద్దేవా చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి చెరుకు ముత్యంరెడ్డి హయాంలోనే జరిగిందని గుర్తుచేశారు. గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్ల మాదిరిగా దుబ్బాక ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సను ఎదర్కోవాంటే యువ నాయకత్వం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీజేపీలో బహిష్కరణకు గురైనా కమలాకర్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని కోరగా, తన అనుచరులతో మాట్లాడిన తర్వాత ఆలోచిస్తానని తెలిపారు. 


Updated Date - 2020-10-13T07:24:18+05:30 IST