కోవిడ్ ఎట్ 108
ABN , First Publish Date - 2020-06-18T11:04:15+05:30 IST
ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. మూడు జిల్లాల్లో క్రమంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో సెంచరీ దాటిన కేసులు
73 రోజుల్లో 50 కేసులు.. 5 రోజుల వ్యవధిలో మరో 58
ఇప్పటికే ముగ్గురు మృత్యువాత
వైర్‌సవ్యాప్తితో ప్రజల్లో భయాందోళనలు
స్వీయ నియంత్రణ కీలకమంటున్న నిపుణులు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. మూడు జిల్లాల్లో క్రమంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికీ పాజిటివ్‌గా రిపోర్టులు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు జిల్లాల్లో కలిపి కేసుల సంఖ్య వంద దాటింది. ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ఐదు రోజుల్లోనే 58 కేసులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి పాజిటివ్ కేసు మార్చి 31న నమోదైంది. మెదక్‌కు చెందిన ఓ వ్యక్తి మర్కజ్ వెళ్లి వచ్చాక టెస్ట్ చేయడంతో పాజిటివ్‌గా తేలింది. మొదటి కేసు నుంచి 50 కేసులకు 73 రోజులు పడితే 50 నుంచి 108 కేసులు నమోదవ్వడానికి కేవలం ఐదు రోజులే పట్టడం కరోనా విజృంభనకు అద్దం పడుతోంది. లాక్‌డౌన్ సమయంలో కేసులు తక్కువగా నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడతల వారీగా సడలింపులు ఇవ్వడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. జూన్ 6 వరకు మూడు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 37 కాగా 12వ తేదీ నాటికి 50 కేసుల మార్క్‌ను దాటాయి. ఐదు రోజుల వ్యవధిలోనే అంటే జూన్ 17 నాటికి 108 కేసులు నమోదయ్యాయి.
ఈ నెల 12న సంగారెడ్డి జిల్లాలో 22 పాజిటివ్‌గా తేలాయి. మంగళవారం మెదక్ జిల్లాలో ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి. తూప్రాన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు, పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లికి చెందిన ఏఎన్‌ఎం కరోనా బారిన పడ్డారు. వర్షాకాలం సీజన్ ప్రారంభంకావడంతో వ్యాధులు ప్రబలేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అప్రతమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
తూప్రాన్‌లో మరో 15 మంది హోంక్వారంటైన్
తూప్రాన్ : తూప్రాన్ పాజిటివ్ కేసులతో ఉలిక్కిపడింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మరో 15 మందిని గుర్తించి బుధవారం వారిని హోంక్వారంటైన్ చేశారు. కరోనాతో మృతిచెందిన వ్యాపారి కుటుంబీకుల్లో భార్య, ఇద్దరు కుమారులకు సైతం పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సన్నిహితంగా ఉన్న పలువురు యువకులు ఆందోళనకు గురయ్యారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మున్సిపల్ వాటర్‌మెన్, మృతిచెందిన వ్యాపారి, అతని కుమారుడిని నేరుగా కాంటాక్ట్ అయిన మొత్తం 102 మందిని హోంక్వారంటైన్ చేశారు.
వ్యాపారి కుమారుడితో సన్నిహితంగా ఇద్దరు యువకులకు, వ్యాపారి ఆసుపత్రికి తీసుకెళ్లిన కారు డ్రైవర్‌కు కరోనా పరీక్షల నిమిత్తం నిన్న మెదక్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయగా పరీక్షలు నిర్వహించే వైద్యుడు లేకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు. తూప్రాన్‌లో పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో అధికారులూ భయాందోళనకు గురవుతున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి రాకుండా చుట్టూరా బారీకెడ్లు ఏర్పాటు చేశారు.
వ్యవసాయశాఖ కార్యాలయం వద్దకు వచ్చే రైతులు, ఇతరులను కార్యాలయంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. దరఖాస్తులు తీసుకువస్తే అక్కడున్న బాక్సులో వేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇతర కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. తూప్రాన్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థలను ఆదివారం వరకు బంద్ చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్‌గౌడ్ పేర్కొన్నారు. తూప్రాన్‌లో విచ్చలవిడిగా పర్యటిస్తున్న ప్రజలపై పోలీసులు బుధవారం కొరడా ఝులిపించారు. తూప్రాన్ సీఐ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఎస్‌ఐలు సుభాష్, రాజు, ఏఎ్‌సఐలు రఫియొద్దీన్ పట్టణంలో పర్యటిస్తూ అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని హెచ్చరించారు.
స్వీయ నిర్బంధంలో ఏఎన్‌ఎంకు చికిత్స
పాపన్నపేట : కరోనా పాజిటివ్ వచ్చిన ఏఎన్‌ఎంను ఇంట్లోనే ఉంచి పాపన్నపేట వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. పాపన్నపేటలో ఉంటూ పోడ్చన్‌పల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలోని నాగ్సాన్‌పల్లిలో ఏఎన్‌ఎంగా పని చేస్తున్న మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సదరు మహిళ ఉన్న వీధిని అధికారులు మూసివేశారు. తహసీల్దార్ బలరాం, ఎస్‌ఐ ఆంజనేయులు, సర్పంచ్ గురుమూర్తిగౌడ్, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో సీహెచ్‌వో చందర్, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.
ఏఎన్‌ఎంతో పాటు మరో 16మందిని హోం క్వారంటైన్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో జరగాల్సిన సంతను రద్దు చేశారు. వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. ఇటీవల జరిగిన ఏఎన్‌ఎం సోదరుడి పెళ్లికి కుటుంబసభ్యులు, ఆమె నివసిస్తున్న కాలనీకి చెందిన ఇతరులు వెళ్లినట్లు సమాచారం. పెళ్లికి వెళ్లొచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తల్లో భాగంగా వైద్యసిబ్బంది ఏఎన్‌ఎం కుటుంబసభ్యులతో పాటు ఆమె నివసిస్తున్న ఏరియాలో ఇంటింటి సర్వే నిర్వహించి, పరీక్షల నిమిత్తం మెదక్‌కు తరలించనున్నట్లు డాక్టర్ హరిప్రసాద్ పేర్కొన్నా రు. ఏఎన్‌ఎం ఈనెల 3న నాగ్సాన్‌పల్లిలో చిన్న పిల్లలకు రోగనిరోధక టీకాలను వేసింది. అప్రమత్తమైన పోడ్చన్ పల్లి వైద్య సిబ్బంది చిన్నపిల్లలను, వారి తల్లిదండ్రులను హోంక్వారంటైన్‌లో ఉండాల్సిందిగాసూచించారు.
ఉమ్మడి జిల్లాలో కేసులు
జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో కొవిడ్ -19 ప్రభావం కనిపిస్తోంది. మూడు జిల్లాల్లో నమోదైన మొత్తం కేసుల్లో 60 శాతం సంగారెడ్డి నుంచే ఉన్నాయి. ఆ జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 61 కాగా 16 మంది డిశార్చి అయ్యారు. ముగ్గురు మరణించారు. 42 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 31 కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. ఐదుగురు రికవరీకాగా మిగిలిన 22 మంది ఆసుపత్రుల్లో, ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం కేసులు 16 నమోదు కాగా ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. 10 మంది చికిత్స పొందుతున్నారు.
నర్సాపూర్‌లో భార్య, భర్తకు పాజిటివ్
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఎన్‌జీవో కాలనీకి చెందిన భార్యాభర్తకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నర్సాపూర్‌లోని ఎన్‌జీవో కాలనీలోని భార్యాభర్తకు కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో హైదరాబాద్ తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా బుధవారం ఇద్దరికి పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. విషయం తెలియగానే తహసీల్దార్ మాలతి, ఎస్‌ఐ సత్యనారాయణ, మండల వైద్యాధికారి డాక్టర్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో కాలనీని సందర్శించారు. వారి కుటుంబీలకు హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వారి ఇంటి సమీపంలోని వీధిని పూర్తిగా మూసివేయాలని నిర్ణయించారు.
అధైర్యపడొద్దు : వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి మెదక్
జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విజయ్‌కుమారి బుధవారం సందర్శించి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడారు. కరోనా పాజిటివ్ వచ్చినా ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెప్పారు. పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.
నేటి నుంచి గంట వరకే దుకాణాలు
నర్సాపూర్‌లో కరోనా పాజిటివ్ రావడంతో మున్సిపల్ ఛైర్మన్ మురళీధర్‌యాదవ్ ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. నేటి నుంచి వ్యాపార సంస్థలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకే నిర్వహించాలని నిర్ణయించారు.