గ్రేటర్ ప్రచారంలో మన నేతలు
ABN , First Publish Date - 2020-11-27T05:37:15+05:30 IST
సంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం ఉఽధృతమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం జోరుగా సాగిస్తూ దూసుకుపోతున్నాయి.

మూడు డివిజన్లలో మంత్రి హరీశ్‌రావు సమన్వయం
ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ప్రచార బాధ్యతలు
బీజేపీ నుంచి స్టార్ క్యాంపెయినర్‌గా రఘునందన్‌రావు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి/మెదక్, నవంబరు 26 : సంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం ఉఽధృతమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం జోరుగా సాగిస్తూ దూసుకుపోతున్నాయి. ఓటర్లను కలుసుకుని తమ పార్టీల మేనిఫెస్టోను వివరిస్తూ కరపత్రాలను అందజేసి ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్లలో సంకుల సమరం నెలకొన్నది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ మూడు డివిజన్లను కైవసం చేసుకొని పట్టు నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం సాగిస్తోంది. మూడు డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత భుజాన వేసుకున్న మంత్రి హరీశ్‌రావు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. మూడు డివిజన్లలో నిత్యం సుడిగాలి ప్రచారం సాగిస్తూ క్యాడర్‌ను ఉత్సాహపరుస్తున్నారు. బూత్‌ల వారీగా ఇన్‌చార్జిలను నియమించి మార్గదర్శనం చేస్తున్నారు. పటాన్‌చెరు డివిజన్‌కు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండగా, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్లకు అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పర్యవేక్షణలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్‌పర్సన్ రోజా శర్మ జిల్లా పరిధిలోని మూడు వార్డుల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇక సంగారెడ్డి జిల్లా పరిధిలోని వార్డులు కాకుండా.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మచ్చబొల్లారం వార్డుకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మెట్టుగూడకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, బాలానగర్ డివిజన్‌కు మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీ్‌షకుమార్ మల్కాజిగిరి నియోజకవర్గంలోని గౌతమినగర్ డివిజన్ ఇన్‌చార్జిగా ఉన్నారు. వీరందరూ ప్రచార బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేసిన రోజు నుంచి వారంతా అప్పగించిన వార్డుల్లో విజయం కోసం స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపల్ పరిధిలోని టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, పలు మండలాల నేతలు హైదరాబాద్ తరలివెళ్లి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ తరఫున దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావు స్టార్ క్యాంపెయినర్‌గా గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డికి మోండా మార్కెట్ డివిజన్ బాధ్యతలను కేటాయించారు. అదే డివిజన్‌లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌కు పొరుగున ఉమ్మడి మెదక్ జిల్లా ఉండటంతో పెద్ద ఎత్తున నాయకులు నగరానికి తరలివెళ్లి ఆయా పార్టీల తరఫున ప్రచార పర్వంలో నిమగ్నమయ్యారు.
