అభివృద్ధికి ఉప ఎన్నిక బ్రేక్‌!

ABN , First Publish Date - 2020-10-07T06:55:51+05:30 IST

దుబ్బాక ఉపఎన్నిక తెరమీదికి రావడంతో అభివృద్ధి పనులకు అంతరాయం తప్పడం లేదు

అభివృద్ధికి ఉప ఎన్నిక బ్రేక్‌!

ఎలక్షన్‌ కోడ్‌తో ప్రారంభోత్సవాలకు దూరం

ఎత్తిపోనున్న దసరా ముహూర్తం

పూర్తయిన కొత్త కలెక్టరేట్‌, సీపీ ఆఫీస్‌

డబుల్‌ ఇళ్ల పంపిణీ కూడా వాయిదా


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబరు 6: దుబ్బాక ఉపఎన్నిక తెరమీదికి రావడంతో అభివృద్ధి పనులకు అంతరాయం తప్పడం లేదు. ఇప్పటికే పూర్తయిన కార్యాలయాలు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది. దసరా పండుగకు ముహుర్తం ఖరారు చేసినప్పటికీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఎక్కడి పనులక్కడ నిలిచిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులూ ఉప ఎన్నిక పనిలో నిమగ్నమయ్యారు.


2016 అక్టోబరు 11, దసరా పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సిద్దిపేటను జిల్లాగా ప్రకటించారు. 2017న మళ్లీ అదే పర్వదినాన దుద్దెడ కలెక్టరేట్‌ సముదాయం, పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణపనులకు భూమిపూజ చేశారు. ఇప్పటికే మెడికల్‌ కాలేజీ నిర్మాణం పూర్తయి క్లాసులు కూడా జరుగుతున్నాయి. కలెక్టరేట్‌, సీపీ కార్యాలయాలను ఈ దసరా పండుగ నాడు ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. అదేవిధంగా కేసీఆర్‌తో సిద్దిపేటలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్ల గృహ ప్రవేశం చేయించాలని నిర్ణయించారు. అర్హుల జాబితా కూడా కొలిక్కివచ్చింది. కానీ దుబ్బాక ఉప ఎన్నిక తెరమీదకు రావడంతో అన్నీ కూడా వాయిదా పడ్డాయి. 


నవంబరు 12 తర్వాతే

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎలాంటి అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు చేపట్టకూడదు. గతంలో మొదలైన పనులను మాత్రం కొనసాగించవచ్చు. దాదాపు అన్ని మండలాల్లో కూడా అభివృద్ధి పనులకు అంతరాయం కలిగింది. అధికారుల పర్యవేక్షణ కూడా ప్రస్తుతం తగ్గడంతో సాగుతున్న పనుల్లోనూ జాప్యం జరుగుతున్నది. ఈ నెల 9న దుబ్బాక ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. నవంబరు 3న ఎన్నికలు, నవంబరు 10న కౌంటింగ్‌ ఉంటాయి. నవంబరు 12తో ఈ ప్రక్రియ పూర్తయి, ఎన్నికల కోడ్‌ తొలగుతుంది. ఆ తర్వాతే మళ్లీ అభివృద్ధి పనుల విషయం తెరమీదకు వస్తుంది. 


అందరికీ దుబ్బాక డ్యూటీలే..

ఇటు అధికారులు, ఉద్యోగులు, అటు ప్రజాప్రతినిధులు, నాయకులు దుబ్బాక ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగడానికి మోడల్‌ కోడ్‌ బృందాలు, స్క్వాడ్స్‌, తనిఖీ బృందాలు, ప్రత్యేక అధికారుల పేరిట పలువురు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ గురించి సమీక్షించేవారు నెలన్నర రోజులపాటు ఎన్నికల విధుల్లోనే బిజీగా ఉంటారు. ఇక పనులు చేసేవారిలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు, నాయకులే ఉన్నారు. వీరు కూడా ఆయా పార్టీల తరఫున దుబ్బాక ఎన్నికల్లో ప్రచారం కోసం వెళ్లక తప్పదు. రెండువైపులా ఆజమాయిషి తగ్గుతున్నందున పరోక్షంగా సిద్దిపేట జిల్లా అభివృద్ధికి తాత్కాలిక బ్రేక్‌ తప్పదు. 

Updated Date - 2020-10-07T06:55:51+05:30 IST