వ్యాపారం ఢమాల్‌

ABN , First Publish Date - 2020-12-28T04:52:40+05:30 IST

ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ చర్చి వద్ద ప్రతి ఏటా క్రిస్మస్‌ రోజుల్లో జరిగే జాతర అంటే వ్యాపారులకు పండుగే. చర్చి దారిలో, చుట్టూ ఆవరణలో చిరువ్యాపారుల సందడి అంతాఇంతా కాదు. పెద్దసంఖ్యలో జాతరకు తరలివచ్చే భక్తులు, పర్యాటకులు చర్చి చుట్టూ తిరుగుతూ వివిధ వస్తువులను కొనడం, ఉత్సాహంగా ఆట వస్తువులకు గిరాకీ చేయడం కనిపిస్తూ ఉండేది. కానీ ఈ ఏడాది క్రిస్మస్‌ జాతరకు ఎక్కడిక్కడి నుంచో వచ్చి దుకాణాలు, ఆట వస్తువులను ఏర్పాటు చేసిన వ్యాపారులందరికీ ఊహించని షాక్‌ తగిలింది. నాలుగు రాళ్లు సంపదించుకుందామని దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వారి ఆశలన్నీ తలకిందులయ్యాయి.

వ్యాపారం ఢమాల్‌

మెదక్‌ చర్చి క్రిస్మస్‌ జాతరకు కరోనా ఎఫెక్ట్‌

చర్చి వద్ద వ్యాపారాలకు దెబ్బ

గతేడాది కంటే తగ్గిన జనసందోహం

రవాణా ఖర్చులు కూడా రాలేవని వాపోతున్న వ్యాపారులు


మెదక్‌ కల్చరల్‌, డిసెంబరు 27 : ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ చర్చి వద్ద ప్రతి ఏటా క్రిస్మస్‌ రోజుల్లో జరిగే జాతర అంటే వ్యాపారులకు పండుగే. చర్చి దారిలో, చుట్టూ ఆవరణలో చిరువ్యాపారుల సందడి అంతాఇంతా కాదు. పెద్దసంఖ్యలో జాతరకు తరలివచ్చే భక్తులు, పర్యాటకులు చర్చి చుట్టూ తిరుగుతూ వివిధ వస్తువులను కొనడం, ఉత్సాహంగా ఆట వస్తువులకు గిరాకీ చేయడం కనిపిస్తూ ఉండేది. కానీ ఈ ఏడాది క్రిస్మస్‌ జాతరకు ఎక్కడిక్కడి నుంచో వచ్చి దుకాణాలు, ఆట వస్తువులను ఏర్పాటు చేసిన వ్యాపారులందరికీ ఊహించని షాక్‌ తగిలింది. నాలుగు రాళ్లు సంపదించుకుందామని దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వారి ఆశలన్నీ తలకిందులయ్యాయి. కరోనా ప్రభావంతో వ్యాపారాలకు పెద్ద దెబ్బ తగిలింది.

ప్రతీ సంవత్సరం చర్చి వేడుకల్లో లక్షలాదిగా తరలివచ్చే జనంతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దూర భారం లెక్కచేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి వ్యాపారాలను కొనసాగిస్తారు. దుస్తులు, గడియారాలు, చిన్నారుల ఆటబొమ్మలు, చిరుతిండ్లు, రంగుల రాట్నం, సర్కస్‌, డిస్కో డ్యాన్స్‌, వీల్స్‌ లాంటి ఆట వస్తువుల వ్యాపారులు క్రిస్మస్‌ ముందే ఇక్కడకు వస్తారు. ఆట వస్తువుల వ్యాపారులు వారం ముందే వచ్చి వాటిని బిగించే పనిలో నిమగ్నమౌతారు. దూర ప్రాంతాల నుంచి లారీల్లో తేవడం వారికి తలకుమించిన భారం. వ్యాపారం సరిగ్గా జరిగితే అన్ని ఖర్చులు పోను వారికి ఎంతోకొంత మిగలుతుందని ఎంతో ఆశతో వచ్చేస్తారు. కానీ ఈసారి లాభాల మాట దేవుడెరుగు ఖర్చులైన వస్తే చాలు అని వ్యాపారులు అనుకుంటున్నారు. కరోనా కొంచెం తగ్గుముఖం పట్టడంతో వ్యాపారానికి ఎలాంటి అవాంతరాలు ఉండవని చాలా మంది ఎన్నో ఆశలతో క్రిస్మస్‌ జాతరకు వచ్చారు. కానీ రవాణా ఖర్చులకు కూడా కష్టమవుతుందని వ్యాపారులు వాపోతున్నారు. ఈసారి యాభై శాతం వ్యాపారం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా భయంతో జనాలు ఎక్కువగా రాకపోవడం.. వచ్చినా కొనుగోలు చేసేందుకు నిరాసక్తత వ్యక్తం చేయడంతో వ్యాపారానికి దెబ్బపడింది.


కరోనా మా కడుపు కొట్టింది

మధ్యప్రదేశ్‌ నుంచి డ్యాన్సింగ్‌ వీల్‌ తీసుకొచ్చాం. దీని కోసం మాకు రవాణా ఖర్చులు చాలా ఎక్కువయ్యాయి. బిగించడానికి వారం రోజులు పట్టింది. గత సంవత్సరం లాగా వ్యాపారం జరుగుతుందని భావించాం. కరోనాతో జనాలు రాకపోవడంతో వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది.

- చందు, మధ్యప్రదేశ్‌


50 శాతం వ్యాపారం కూడా లేదు 

ఏళ్ల తరబడి వ్యాపారరం చేస్తున్నాను. ప్రతీ సంవత్సరం వ్యాపారం తీరికలేకుండా సాగేది. ఈసారి పూర్తిగా నిరాశపర్చింది. గతేడాది జరిగిన వ్యాపారంలో 50 శాతం కూడా లేదు. ఈసారి వ్యాపారంలో చాలా నష్టం జరిగింది. తీసుకొచ్చిన సామన్లు అలాగే మిగిలిపోయాయి.

- సతీష్‌, వ్యాపారి, మెదక్‌


ఊహించలేని దెబ్బ

ప్రతీ ఏటా ఇక్కడికి వస్తుంటాను. గడియారాల వ్యాపారం చేస్తుంటాను. ఈసారి వ్యాపారం ఇంత తక్కువగా జరుగుతుందని ఊహించలేదు. పెట్టిన డబ్బు సైతం వచ్చేలా లేవు. 25 శాతం గడియారాలు కూడా అమ్ముడవలేదు. ఖర్చులకు కూడా ఇబ్బందిగా ఉంది. తక్కువ డబ్బుకే అమ్మేయాలని ప్రయత్నిస్తున్నా కొనేవారు కరువయ్యారు.

-వికాస్‌, గడియారాల వ్యాపారి, హైదరాబాద్‌




Updated Date - 2020-12-28T04:52:40+05:30 IST