కిలో టమాటా రూ. 50
ABN , First Publish Date - 2020-03-24T05:56:30+05:30 IST
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతో మార్కెట్ వ్యాపారులు అందిన కాడికి దండుకుంటున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా...

- రూ. 10 నుంచి ఒకేసారి పెంపు
- మిగతా వాటి ధరలూ రెట్టింపు
- చికెన్ ధర కూడా డబుల్
- అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
- జిల్లా పౌర సరఫరాల అధికారులు
మెదక్, మార్చి 23: కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతో మార్కెట్ వ్యాపారులు అందిన కాడికి దండుకుంటున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆదివారం జనతా కర్ఫ్యూ నిర్వహించడంతో సోమవారం ప్రజలు నిత్యావసర సరుకుల కోసం బారులు తీరారు. సంక్షోభ సమయం కావడంతో ఆశామాషీగా తీసుకొని రోడ్లపై తిరగొద్దని ప్రధాని మొదలుకొని పోలీసుల వరకు హెచ్చరిస్తుండడంతో రానున్న రోజుల్లో మార్కెట్ బంద్ అవుతుందేమోనన్న ఆందోళన ప్రజల్లో పెరిగింది. సోమవారం మెదక్ కూరగాయల మార్కెట్‌లో కిలో టమాటా రూ.50కు విక్రయుంచారు.
అంతకు ముందు కిలో రూ.10కే అమ్మిన టమాటా రూ.50కి విక్రయించినప్పటికీ మారుబేరం లేకుండా కొనుగోలు చేశారు. ఉల్లిగడ్డ కూడా హోల్‌సెల్ మార్కెట్‌లో అందుబాటులో లేదని, స్థానిక విక్రేతలకు సమాచారం అందడంతో క్రమేపీ ధరలు పెంచుతున్నారు. పచ్చి మిరపకాయలు కిలో రూ.80కి పెరిగింది. మూడునాలుగు రోజుల క్రితం రూ.40కే విక్రయించారు. ఇలా ఒకటేమిటి అన్ని కూరగాయల ధరలు ఒక్కసారిగా పెంచి విక్రయిస్తున్నారు. అంటువ్యాధుల నియంత్రణ చట్టం 1897 కింద జనాలు పరిమితంగా రావాలని వాహనాలను నిలిపివేయడానికి వెనకాడమని పోలీసులు హెచ్చరిస్తుండడంతో వారంపాటు సరిపోను సంచులకొద్దీ కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.
చికెన్ ధరలకు రెక్కలు
కరోనా వైరస్ ప్రభావంతో చికెన్ మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులకు గురవుతున్న విషయం తెలిసిందే. నిన్నటివరకు చికెన్ కొనే దిక్కేలేక పౌలీ్ట్ర రైతులు కోళ్లను పంచిపెట్టగా.... నేడు కిలో చికెన్ రూ.100కు పెరిగింది. వెల్దుర్తి మండలంలో పౌలీ్ట్ర ఫారం నిర్వాహకులు 10వేల కోళ్లను సజీవంగా పాతిపెట్టిన ఘటనను మరువక ముందే చికెన్ ధరలు అమాంతం పెరగడం గమనించాల్సిన విషయం. ప్రభుత్వాలు, పౌలీ్ట్రఫామ్ కంపెనీలు చికెన్ తినడం మూలంగా కోవిడ్-19 వైరస్ సోకదని విస్తృతంగా ప్రచారం చేశాయి. అనేక జిల్లాల్లో చికెన్ వంటకాలు వండి ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు. ఇలా జనాలకు అవగాహన కల్పించడంతో చికెన్ ధరలు క్రమేణా పుంజుకుంటున్నాయి.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
కరోనా కట్టడికి 31 వరకు తెలంగాణ సర్కారు లాక్‌డౌన్ ప్రకటించడంతో నత్యావసర సరుకుల విక్రేతలు ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. సోమవారం ఉదయం నుంచి జిల్లాకేంద్రంలోని షాపింగ్‌మాల్స్, కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. పండ్లు, పాలు, బియ్యం, పప్పు ధాన్యాలు, నూనెలు ఇలా నిత్యవసర సరుకులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
త్వరలో బియ్యం పంపిణీ
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో నిరుపేదలకు ఇబ్బందులు కలుగకుండా ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో రోజూ కూలీలకు ఉపాధి కరువై ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టింది. వారం పాటు వారికి కూలీ పనులు చేయడానికి వీలు లేకుండా స్వీయ నిర్భందంలో ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. జిల్లాలో తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ప్రభుత్వం బియ్యం ఉచితంగా పంపిణీ చేయనుంది. జిల్లాలో 521 రేషన్ దుకాణాలు ఉండగా 2,13,729 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి 12 కిలోల చొప్పున 4,082 మెట్రిక్ టన్నుల బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు తెలిపారు. వీటిని పంపిణీకి త్వరలో మార్గదర్శకాలు జారీ కానున ్నట్లు వెల్లడించారు.
కొనాలంటేనే భయమేస్తోంది
కరోనా వైరస్ ప్రభావంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు రూ.10కి విక్రయుంచిన టమాటా రూ.50కి అమ్ముతున్నారు. టమాటా ఒక్కటే కాదు అన్ని కూరగాయల ధరలనూ అమాంతం పెంచడంతో కొనుగోలు చేయడం కష్టంగా మారింది. మరో వారం పాటు లాక్‌డౌన్ పేరుతో వ్యాపారులు ధరలను పెంచకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
- వెంకట్, మెదక్