సోషల్‌ మీడియాను ఫేక్‌ మీడియాగా మార్చిన బీజేపీ

ABN , First Publish Date - 2020-12-01T05:47:16+05:30 IST

సోషల్‌ మీడియాను ఫేక్‌ మీడియాగా మార్చి అడ్డదారుల్లో గెలవాలన్న భ్రమలో బీజేపీ నాయకులు ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

సోషల్‌ మీడియాను ఫేక్‌ మీడియాగా మార్చిన బీజేపీ
పటాన్‌చెరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

టీవీల లోగోలతో తప్పుడు వార్తలతో దుష్ప్రచారం

ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్న బీజేపీ

మోదీ, అమిత్‌షా ప్రచారం చేసినా ఓటమి తప్పదని అసహనం

కమిషనర్‌ కార్యాలయం ఎదుట బీజేపీ చేసిన ధర్నా పెద్ద డ్రామా

రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు


పటాన్‌చెరు, నవంబరు 30: సోషల్‌ మీడియాను ఫేక్‌ మీడియాగా మార్చి అడ్డదారుల్లో గెలవాలన్న భ్రమలో బీజేపీ నాయకులు ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. సిద్ధాంతాలు, నైతిక విలువలు లేని పార్టీగా నేడు బీజేపీని సరికొత్త అవతారంలో చూస్తున్నామన్నారు. ఎన్నికల విధానాన్ని అపహాస్య చేసే విధంగా వారు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చే విధంగా ఉందని వివరించారు. సోషల్‌ మీడియాలో పేరున్న ఛానళ్ల లోగోలను మార్ఫింగ్‌ చేసి టీఆర్‌ఎస్‌ ప్రముఖ నాయకులు బీజేపీలు చేరతారని తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉందని వాపోయారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై కేసులు వేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుబ్బాక ఎన్నికలో సైతం టీవీ 9లోగోను వాడుకుని దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్న బీజేపీ నాయకులకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత పత్తాలేకుండా పోవడం ఖాయమని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన మోదీ, అమిత్‌షా, నడ్డాలాంటి నాయకులు ప్రచారం చేసినా ఓటమి తప్పదని బీజేపీ అభ్యర్థులకు తెలిసిపోయి అసహనం ప్రదర్శిస్తున్నారన్నారు. తప్పుడు వార్తలు, గలాట, ఘర్షణలు సృష్టించి ప్రశాంతమైన హైదరాబాద్‌ వాతావరణాన్ని చెడగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. సోమవారం నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు చేసిన ధర్నాను పెద్ద డ్రామాగా కొట్టిపడేశారు. కేంద్రంలో ప్రఽభుత్వం ఉన్నా పైసా తేలేని బీజేపీ నాయకులు నాయకులు కార్పోరేటర్‌లుగా గెలిచి సాధించేది శూన్యమని తెలిపారు. నిజంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చే వారైతే ఉన్న మంత్రి, ఎంపీలు ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ఇవ్వాల్సిన జీఎ్‌సటీ వాటానే ఇంతవరకు ఇవ్వకుండా నాటకాలాడుతోందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోరుకునే ఓటర్లు టీఆర్‌ఎ్‌సను గెలిపించేందుకు కృషి చేస్తున్నారన్నారు. తనతో సహా ముఖ్య టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులపై తప్పుడు వార్తలతో పోస్టింగ్‌లు పెట్టే అవకాశం ఉందని తెలిసిందన్నారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరూ సంయమనం కోల్పోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేందుకు ఓటర్లకు సహకరించాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, చింతాప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:47:16+05:30 IST