దుబ్బాకలో ఎగిరేది బీజేపీ జెండానే

ABN , First Publish Date - 2020-10-28T11:20:19+05:30 IST

ఎవరెన్ని కుట్రలు చేసినా దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ జెండా ఎగరేసి తీరుతామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు

దుబ్బాకలో ఎగిరేది బీజేపీ జెండానే

టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది

అక్రమ కేసులతో గెలవాలని చూస్తున్నారు

దుబ్బాక ప్రజలు విజ్ఞత కలిగిన తీర్పునిస్తారు

దౌర్జన్యాన్ని ఓటుతో తిప్పికొడతారు

సీఎం సర్వేల్లో బీజేపీ గెలుపు ఖాయమని తేలింది

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ


దుబ్బాక, అక్టోబరు 27: ఎవరెన్ని కుట్రలు చేసినా దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ జెండా ఎగరేసి తీరుతామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. గ్రామాల్లో బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి టీఆర్‌ఎ్‌సకు భయం పట్టుకుందని, ప్రజలు, యువకులు స్వచ్ఛందంగా బీజేపీ వైపు కదిలి వస్తుంటే టీఆర్‌ఎస్‌ బెదిరిపోతున్నదని ఆమె అన్నారు. మంగళవారం రాత్రి దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని ధర్మాజీపేట వార్డులో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం దుబ్బాకలోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో జరిగిన గొల్లకుర్మల సమావేశంలో మాట్లాడారు. అధికార దాహంతో, అహంకారంతో టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులను బీజేపీ నాయకులు, కార్యకర్తలపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.


బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. రఘునందన్‌రావు ప్రజల్లోకి వెళ్లే టీఆర్‌ఎ్‌సకు డిపాజిట్‌ దక్కదనే భయంతోనే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఎవరి వద్ద ఉన్నాయో, ఎవరు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నారో దుబ్బాక ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం పోలీసులతో బీజేపీపై దాడులు చేయిస్తున్నదని మండిపడ్డారు. ఉప ఎన్నిక వచ్చే వరకు దుబ్బాక వైపు చూడని హరీశ్‌రావు.. ఇప్పుడు దుబ్బాక బాధ్యత తనదేనని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిని సిద్దిపేటకు తరలించుకుపోయిన హరీశ్‌రావును ఇప్పుడు దుబ్బాకకు కాపలాగా ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. దుబ్బాక పగ్గాలు హరీశ్‌రావుకు అప్పగించడమంటే ఆత్మగౌరవాన్నీ తాకట్టు పెట్టడమేనన్నారు. టీఆర్‌ఎ్‌సకు దీటైన మోనగాడు రఘునందన్‌రావు అని ప్రజలు గుర్తించారని, అందుకే ఎమ్మెల్యేగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ప్రజల పక్షాన నిలబడే నాయకుడినే అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. అడుగడుగునా కేసులు పెట్టినా జంకకుండా ప్రజల పక్షాన నిలబడే చైతన్యం కలిగిన నాయకుడినే ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ చేయించిన సర్వేల్లో కూడా బీజేపీ గెలుపు ఖాయమని తేలిందన్నారు. తమ పీఠం కదులుతుందనే భయంతోనే పోలీసుతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.


రఘునందన్‌ అడుగు పెడితే అసెంబ్లీ దద్దరిల్లుతుంది : బాబూమోహన్‌

రఘునందన్‌రావు గెలుస్తున్నాడనే సాంకేతాలు రావడంతోనే ఎలాగైనా ఓడించాలని ఫాంహౌస్‌ సీఎం కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి బాబూమోహన్‌ ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతోనే రఘునందన్‌రావు గెలుపును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేసి, అధికారాన్ని దుర్వినియోగం చేసి బీజేపీని ఓడించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.


అయినా రఘునందన్‌రావు బుల్లెట్‌లా దూసుకుపోవడం ఖాయమని తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేటనే శాసించిన దుబ్బాక ప్రజలు.. సిద్దిపేట వాళ్లకింద ఉండరని హరీశ్‌రావు గ్రహించాలని స్పష్టం చేశారు. దుబ్బాక ప్రజలు సిద్దిపేట పెత్తనాన్ని వణికించేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్‌ గ్రహించాలని హెచ్చరించారు. అనంతరం మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మాట్లాడారు. 

Updated Date - 2020-10-28T11:20:19+05:30 IST