దుబ్బాకలో గెలిచేది మేమే
ABN , First Publish Date - 2020-10-21T07:23:23+05:30 IST
‘‘దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందనడానికి అధికార పార్టీ చేస్తున్న హైరానే సాక్ష్యం. ఎన్ని కేసులు పెట్టినా..

వేధింపులకు, తప్పుడు కేసులకు బెదిరేది లేదు
టీఆర్‌ఎస్‌దే తప్పుడు ప్రచారం
కేంద్రం ఇచ్చిన ప్రతీ పైసా లెక్క చెబుతాం
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు
దుబ్బాక, అక్టోబరు20: ‘‘దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందనడానికి అధికార పార్టీ చేస్తున్న హైరానే సాక్ష్యం. ఎన్ని కేసులు పెట్టినా.. వేధింపులు ఏవైనా దుబ్బాక కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయం’’ అని బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం దుబ్బాకలోని బీజేపీ ఎన్నికల కార్యాయలంలో (ఓ ఫంక్షన్‌హాల్‌లో) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘునందన్‌రావు మాట్లాడారు. సోమవారం ఒకే కారును మూడుసార్లు తనిఖీ చేశారని, పదేపదే తనిఖీలు చేసి, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి మనోధైర్యం దెబ్బతీయానుకుంటే జంకేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాదని ఆయన స్పష్టం చేశారు. నరనరాన దేశభక్తి నిండిన కాషాయ దళమని చెప్పారు. సోమవారం రాత్రి తమ కారును కావాలనే ధ్వం సం చేశారని, ఇదేమని అడిగితే తమకు తనిఖీ చేసే అధికారం ఉందనడం దారుణమన్నారు. దుబ్బాకలో తాము గెలుస్తున్నామనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. తప్పుడు కేసులతో కార్యకర్తలను దూరం చేస్తామనుకోవడం టీఆర్‌ఎస్ భ్రమ అని చెప్పారు. తమ కార్యకర్తలు మరింత పట్టుదలతో పని చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. టీఆర్‌ఎస్ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలు చేసేదే టీఆర్‌ఎస్ అని వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ర్టానికి ఇచ్చిన నిధులను నయాపైసా చొప్పున లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 2014 నుంచి ఎన్ని నిధులు రాష్ర్టానికి వచ్చాయో బహిరంగంగా చెప్పడానికి సిద్ధమని ఆయన తెలిపారు.
కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, తమతో చర్చకు వస్తే ప్రతిపైసా లెక్క చెప్పడానికి సిద్ధమన్నారు. దబ్బాకలో టౌన్‌హాల్, చేర్వాపూర్ రహదారి వేయకుండానే నిధులు కాజేశారని సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న వివరాల ద్వారానే నిజానిజాలు చెబుతున్నామని తెలిపారు. దుబ్బాకలో రూ.3 కోట్లు టౌన్ హాల్‌కు ఖర్చు చేసినట్టుగా సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులు తెలియజేశారని చెప్పారు. చేర్వాపూర్-దుంపలపల్లి రహదారికి రూ.కోటి ఖర్చు అయినట్లు అధికారులిచ్చిన సమాచారంలో ఉందన్నారు. దుబ్బాకలో ఇన్నాళ్లు జరిగిన పనులు, నిధుల సంగతి.. వాటిని కాజేసీ పర్సంటేజీలను తీసుకున్న సంగతి ప్రజలకు తెలుసని రఘునందన్‌రావు స్పష్టం చేశారు. ఇకపై అవినీతికి చోటు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రశ్నించే గొంతుకగా తనను ఈ ఉపఎన్నికలో గెలిపించాలని, టీఆర్‌ఎ్‌సకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలు చూస్తున్నారని చెప్పారు. సమావేశంలో నాయకులు బాలే్‌షగౌ డ్, రాజిరెడ్డి, మాధవనేని భాను, సుంకు ప్రవీణ్, తొగుట రవి, బాచి తదితరులున్నారు.