సచివాలయానికే వెళ్లని ముఖ్యమంత్రికి కొత్త భవనం ఎందుకు ?

ABN , First Publish Date - 2020-11-27T05:39:46+05:30 IST

ఏనాడు సచివాలయానికి వెళ్లని సీఎంకు కొత్త భవనం ఎందుకని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

సచివాలయానికే వెళ్లని ముఖ్యమంత్రికి కొత్త భవనం ఎందుకు ?
పటాన్‌చెరులో రోడ్‌షోలో అభివాదం చేస్తున్న బండి సంజయ్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


పటాన్‌చెరు, నవంబరు 26 : ఏనాడు సచివాలయానికి వెళ్లని సీఎంకు కొత్త భవనం ఎందుకని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా గురువారం పటాన్‌చెరు డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కేవలం కమీషన్ల కోసం రూ.750 కోట్లతో కొత్త సచివాలయం కడుతున్నారని విమర్శించారు. కొవిడ్‌, వరదల లాంటి ఆపద సమయంలో ఇల్లు వదిలి రాని సీఎం ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తాగి బండి నడిపితేనే ఫైన్‌ వేస్తే తాగి ప్రభుత్వాన్ని నడిపే వారిని ఏం చేయాలని ప్రశ్నించారు. నగరం చుట్టూ నిర్మించిన డబుల్‌బెడ్రూంలను పంచకుండా ఎన్నికల్లో చూపించి ఓట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇచ్చిన రెండు లక్షల ఇళ్ల కోసం కేటాయించిన రూ.3500 కోట్ల నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీకి పట్టం కడితే క్యాబ్‌ డ్రైవర్లకు ఏడాదికి రూ.7 వేలు ఇస్తామని తెలిపారు. విద్యార్థులకు ట్యాబ్‌లు, పేదల బస్తీలకు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పూర్తిగా ఉచితంగా చేస్తామని తెలియజేశారు. 125 గజాల్లో కట్టే ఇళ్లకు అనమతులు అవసరం లేకుండా చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని మూడు డివిజన్లను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఎన్నికల ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులు ఆశి్‌షగౌడ్‌, గోదావరి, నర్సింగ్‌గౌడ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకే్‌షరెడ్డి, మురళీధర్‌గౌడ్‌, రాంనాథ్‌, గడీల శ్రీకాంత్‌గౌడ్‌, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T05:39:46+05:30 IST