కరోనాపై సమరం.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు

ABN , First Publish Date - 2020-03-12T08:40:15+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లావైద్యఆరోగ్యశాఖ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను

కరోనాపై సమరం.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు

సిద్దిపేట, మార్చి11: కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లావైద్యఆరోగ్యశాఖ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఎక్కడైనా అనుమానిత కేసు నమోదైతే వెంటనే స్పందించేందుకు జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణలో ఐదుగురు స్పెషలిస్టు డాక్టర్లతో రాపిడ్‌ రెస్పాన్స్‌ టీం ఏర్పాటు చేశారు. పదిమంది డాక్టర్లతో జిల్లా ఎపిడమిక్‌ సెల్‌ నెలకొల్పారు. ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు, అనుమానిత కేసులుంటే సత్వరం స్పందించేందుకు కోవిడ్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 9392197136 ఏర్పాటు చేశారు. 

  ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వ్యాధికి గురవ్వగా వేల మంది అసువులు బాశారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే కరోనా వైరస్‌ లక్షణాలుగా భావించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఇతర దేశాల నుంచి వచ్చిన వారు జలుబు, దగ్గు, తుమ్ములు ఉంటే వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నా రు.  రాష్ట్రస్థాయిలో హెల్ప్‌లైన్‌ 104 ఏర్పాటు చేశారు.  కరోనా వైరస్‌ అనుమానితుల కోసం సిద్దిపేట వైద్య కళాశాల, గజ్వేల్‌ జిల్లా ఆస్పత్రితో పాటు జిల్లాలోని రెండు ప్రైవేట్‌ వైద్యకళాశాలల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశారు.

పాఠశాల స్థాయి నుంచే

కరోనాపై పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీ జిల్లాలోని అన్ని హైస్కూళ్ల విద్యార్థులకు టీశాట్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ పద్దతిలో రాష్ట్రవిద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా అవగాహన కల్పించాయి.  

 జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల డాక్టర్లకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో అవగాహన కల్పించారు. కళాశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా జిల్లా వైద్యాధికారులు వెళ్లి అవగాహన కల్పించారు. సెర్ప్‌, గ్రామైక్య సం ఘాలకు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలల్లో  విద్యార్థులకు కోవిద్‌ కంట్రోల్‌ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. 

అందుబాటులోకి టోల్‌ఫ్రీ 

కరోనావైరస్‌ సోకినట్లుగా ఏమాత్రం అనుమానాలున్నా నివృత్తి చేయడానికి, అనుమానిత కేసులుంటే వెంటనే స్పందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రస్థాయిలో 104 టోల్‌ఫ్రీ నంబర్‌, జిల్లాస్థాయిలో వైద్యఆరోగ్యశాఖ టోల్‌ఫ్రీ నంబర్‌ 9392197136 అందుబాటులోకి తెచ్చిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మనోహర్‌ తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, కలెక్టర్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కరపత్రాలను ముద్రించారు. 


రాపిడ్‌ రెస్పాన్స్‌ టీం

ఎక్కడైనా అనుమానిత కేసు వచ్చిందంటే వెంటనే స్పందించేందుకు జిల్లా వైద్యాధికారి మనోహర్‌ పర్యవేక్షణలో ఐదుగురు స్పెషలిస్టు డాక్టర్లతో రాపిడ్‌ రెస్పాన్స్‌ టీం ఏర్పాటు చేశారు. ఇందులో వైద్య నిఫుణులు పవన్‌కుమార్‌రెడ్డి, రుక్మారెడ్డి, కాశినాథ్‌, క్రాంతి, జాకీర్‌హుసేన్‌లున్నారు. పదిమంది డాక్టర్లతో జిల్లా ఎపిడమిక్‌ సెల్‌ నెలకొల్పారు. ఈ బృందం ఈనెల 13న రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందనున్నది. డీఎంహెచ్‌వో పరిధిలో ఉన్న హెల్త్‌ ఎడ్యూకేటర్స్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోకి పంపించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు. ఇందుకు ప్రజా ప్రతినిధులు, ఇతరుల సహకారం తీసుకుంటున్నారు. 



Updated Date - 2020-03-12T08:40:15+05:30 IST