ఐఐటీహెచ్‌లో అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్ శంకుస్థాపన
ABN , First Publish Date - 2020-12-30T05:36:11+05:30 IST
మనుషుల అవసరం లేకుండా వాహనాలు, డ్రోన్లను నడిపించేందుకు ఐఐటీహెచ్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ ఆన్‌లైన్ ద్వారా అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్‌కు మంగళవారం శంకుస్థాపన చేశారు.

కంది, డిసెంబరు 29 : మనుషుల అవసరం లేకుండా వాహనాలు, డ్రోన్లను నడిపించేందుకు ఐఐటీహెచ్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ ఆన్‌లైన్ ద్వారా అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్‌కు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఐఐటీహెచ్‌లోని ఆడిటోరియంలో డైరెక్టర్ బీఎ్‌స.మూర్తి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రమంత్రితో పాట, ఐఐటీహెచ్ చైర్‌పర్సన్, బోర్డ్ ఆఫ్ గవర్నర్ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఇంటర్ డిసిప్లీనరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అభివృద్ధికి సంబంధించిన జాతీయ మిషన్‌లో భాగంగా ఐఐటీహెచ్ ప్రాంగణంలో రూ.135 కోట్లతో రెండెకరాల్లో నిర్మాణం చేపట్టనున్నారు. ఐఐటీహెచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి నేతృత్వంలో దీని ద్వారా కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం మెరుగైన నావిగేషన్ వ్యవస్థలను అందుబాటులోని తేవడం కోసం పరిశోధనలు జరపనున్నారు. టిహాన్ ఫౌండేషన్ అని పిలువబడే ఈ పరిశోధనా కేంద్రం నుంచి పాదచారులు రోడ్డు దాటేటప్పుడు, ఇతర వాహనాలు ఎదురుగా వచ్చినప్పుడు, సిగ్నళ్ల వద్ద వాహనాల పనితీరును పరిశీలిస్తారు. అంతేగాక స్వతంత్రంగా నడిచే రవాణా వ్యవస్థ, వ్యవసాయం, సర్వేలెన్స్, పర్యావరణం, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ రంగాల్లో అటానమస్ నావిగేషన్ వ్యవస్థలను వినియోగించుకునేలా పరిశోధనలు చేయనున్నారు. పంటలకు ఎరువులు చల్లడం, దిగుబడుల అంచనా, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లోని పరిస్థితులను డ్రోన్ల ద్వారా తెలుసుకోవడం వంటి భిన్న అంశాల్లో ఈ వ్యవస్థల వినియోగాన్ని పరిశీలించనున్నారు.