అనంత్‌సాగర్‌లో అట్టహాసంగా బండిషిడీ ప్రదర్శన
ABN , First Publish Date - 2020-12-28T04:54:15+05:30 IST
మండలంలోని అనంత్‌సాగర్‌లో మల్లన్న జాతర సందర్భంగా ఆదివారం నిర్వహించిన బండిషిడీ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నది.

నారాయణఖేడ్, డిసెంబరు 27 : మండలంలోని అనంత్‌సాగర్‌లో మల్లన్న జాతర సందర్భంగా ఆదివారం నిర్వహించిన బండిషిడీ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నది. కర్ణాటకలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మాదిరిగా ఇక్కడ కూడా మార్గశిరం ప్రారంభంలో మల్లన్న ఉత్సవాలు నిర్వహిస్తారు. షిడీ ప్రదర్శనను గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాల వారు నిర్వహించడం ఆనవాయితీ. షిడీ ప్రదర్శనను పురస్కరించుకుని గ్రామస్థులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బండికి పొడుగాటి కర్రను అమర్చి, ఆ కర్రకు ప్రదర్శన చేసే భక్తుడి ఒక కాలును చివర కడతారు. దీంతో భక్తుడు ఒక చేతితో కర్రను పట్టుకుని మరో చేతితో భక్తులపై కుంకుమ, పసుపు, వేపాకును చల్లుతుంటాడు. ఇలా భక్తుడిని గుడి చుట్టూ ఐదుసార్లు తిప్పుతారు. అయితే ఆదివారం నిర్వహించిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. 150 సంవత్సరాలకు పైగా తమ కుటుంబసభ్యులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారని, ఆ ఆనవాయితీని తాము కొనసాగిస్తున్నామని అనంత్‌సాగర్‌కు చెందిన ఒగ్గు శ్రీనివాస్ తెలిపారు.