తూప్రాన్‌లో బాణామతి చేస్తున్నారని దాడి

ABN , First Publish Date - 2020-12-28T04:56:02+05:30 IST

తమ వీధిలోని వారి ఆకస్మిక మరణాలకు కారణమంటూ ఓ వ్యక్తిపై పలువురు దాడి చేసిన ఘటన ఆదివారం తూప్రాన్‌ పట్టణంలో జరిగింది. అడ్డువచ్చిన భార్య, కుమారుడిపై సైతం దాడికి పాల్పడ్డారు. కుల పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

తూప్రాన్‌లో బాణామతి చేస్తున్నారని దాడి

తూప్రాన్‌, డిసెంబరు 27: తమ వీధిలోని వారి ఆకస్మిక మరణాలకు కారణమంటూ ఓ వ్యక్తిపై పలువురు దాడి చేసిన ఘటన ఆదివారం తూప్రాన్‌ పట్టణంలో జరిగింది. అడ్డువచ్చిన భార్య, కుమారుడిపై సైతం దాడికి పాల్పడ్డారు. కుల పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. తూప్రాన్‌ పట్టణంలోని కిందివాడకట్టుకు చెందిన మాచిన్‌పల్లి శేఖర్‌ శనివారం ఉరేసుకొని చనిపోయాడు. దహన సంస్కారాలకు తీసుకెళ్లే సమయంలో బాణామతి కారణంగా చనిపోయాడంటూ అదే వాడకట్టుకు చెందిన రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి కుక్కల మల్లయ్య ఇంటిపై మహిళలు మన్ను పోసినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో మాట్లాడేందుకు కులపెద్దలు మల్లయ్య కుటుంబీకులను సంఘం వద్దకు రప్పించినట్లు చెబుతున్నారు. బాణామతి చేయడంతోనే యువకులు ఆకస్మాత్తుగా చనిపోతున్నట్లు పలువురు ఆరోపించారు. గ్రామ పెద్దలు  మాట్లాడుతుండగానే ఓ మహిళ తన భర్త స్వామి, బావబాబుల మరణానికి మల్లయ్యే కారణమంటూ దాడికి యత్నించింది. దీంతో మహిళలు, యువకులు ఒక్కసారిగా మల్లయ్యపై దాడి చేశారు. అడ్డుకోబోయిన కొడుకు స్వామి, భార్య నాగమ్మపైనా దాడి చేశారు. చేతులు, రాళ్లతో దాడి చేయడంతో మలయ్య కుటుంబీలకు  గాయాలయ్యాయి. విషయం తెలియగానే తూప్రాన్‌ పోలీసులు అక్కడకు చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. 


Updated Date - 2020-12-28T04:56:02+05:30 IST