అట్రాసిటీ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ

ABN , First Publish Date - 2020-12-19T05:48:08+05:30 IST

అట్రాసిటీ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చడానికి అందరూ కృషిచేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కోరారు.

అట్రాసిటీ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ 


సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 18:  అట్రాసిటీ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చడానికి అందరూ కృషిచేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కోరారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన అదాలత్‌ చారిత్రక కార్యక్రమమని పేర్కొన్నారు. డిస్టిక్‌ విజిలెన్స్‌ కమిటీ సమావేశాలను ప్రతీ మూడు నెలలకోసారి నిర్వహించాలని స్పష్టం చేశారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం సత్వరమే అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జోగిని కాలనీలో ప్రైవేటు వ్యక్తులు భూములు కొనుగోలు చేయడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీనెల 30న పౌరహక్కుల దినాన్ని విధిగా నిర్వహించాలని, అధికారులందరూ హాజరుకావాలని సూచించారు. అంతకుమందు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, అదనపు ఎస్పీలు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, సర్వీస్‌ అంశాలు, సాధారణ కేసులు సిద్దిపేట జిల్లాలో 122, మెదక్‌ జిల్లాలో 25, సంగారెడ్డి జిల్లాలో 27 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. రెండు రోజులుగా నిర్వహించిన జన అదాలత్‌ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 10 కేసుల హియరింగ్‌ నిర్వహించామన్నారు. రెండు కేసులు పరిష్కారమయ్యాయని, ఐదు కేసులు తుది దశలో ఉన్నాయని,  మిగతా వాటిలో నివేదికలు రావాల్సి ఉందన్నారు. కమిషన్‌కు వచ్చిన వచ్చిన దరఖాస్తులను ఆయా జిల్లాలకు పంపుతామని, పరిశీలించి యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ను 30 రోజుల్లో పంపాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను బేఖాతరు చేసి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు.  ప్రభుత్వ పథకాలు, రాయితీ రుణాలపై  ఎస్సీ, ఎస్టీలకు అవగాహన కల్పించి లబ్థి పొందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిషన్‌ సభ్యులు విద్యాసాగర్‌, రామ్‌బల్‌నాయక్‌, లీలాదేవి, నరసింహ, కార్యదర్శి పద్మాదాస్‌, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఎస్సీ అభివృద్ధి అధికారి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Read more