నెక్లెస్‌ సొగసులు

ABN , First Publish Date - 2020-12-07T05:30:00+05:30 IST

పర్యాటక రంగంలో సిద్దిపేట జిల్లాకు పెట్టింది పేరు. ఇందులో కోమటిచెరువు మినీ ట్యాంక్‌బండు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకనాడు పిచ్చిమొక్కలు, తుమ్మచెట్లతో వెక్కిరించిన ఈ చెరువు నేడు అందంగా, ఆకర్షణీయంగా తయారైంది.

నెక్లెస్‌ సొగసులు

సిద్దిపేట కోమటిచెరువు చుట్టూ ఆకర్షణీయమైన రోడ్డు

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తర్వాత ఇక్కడే

పూర్తికావొచ్చిన పర్యాటక అద్భుతం

మంత్రి హరీశ్‌ చొరవతో సాకారం

ఈనెల 10న సందర్శించనున్న కేసీఆర్‌


 నెక్లెస్‌ రోడ్డు అనగానే హైదరాబాద్‌ నగరం, ట్యాంక్‌బండు, హుస్సేన్‌సాగర్‌ ఠక్కున గుర్తుకొస్తాయి. నగరవాసులు సేద తీరేందుకు, వినోదాన్ని ఆస్వాదించేందుకు అక్కడి నెక్లెస్‌ రోడ్డు కేంద్రబిందువుగా మారింది... అచ్చం అలాంటి అద్భుతాన్ని త్వరలోనే సిద్దిపేట పట్టణంలో చూడబోతున్నాం. ప్రసిద్ధిగాంచిన కోమటిచెరువు చుట్టూ రంగులహంగులతో ఈ నెక్లెస్‌ రోడ్డును నిర్మిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే వీటి పనులను పూర్తిచేసేలా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. మణిహారం లాంటి ఈ రహదారి కనువిందుగా మారనున్నది. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం నెక్లెస్‌ రోడ్డును సందర్శించనున్నారు. 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 7 : పర్యాటక రంగంలో సిద్దిపేట జిల్లాకు పెట్టింది పేరు. ఇందులో కోమటిచెరువు మినీ ట్యాంక్‌బండు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకనాడు పిచ్చిమొక్కలు, తుమ్మచెట్లతో వెక్కిరించిన ఈ చెరువు నేడు అందంగా, ఆకర్షణీయంగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్నది. సిద్దిపేట ప్రాంతం నుంచే గాక రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటక ప్రేమికులు తరలివచ్చి ఈ చెరువు అందాలను చూసి తన్మయత్వం చెందుతుంటారు. మంత్రి హరీశ్‌రావు తన మానసపుత్రికగా కోమటిచెరువును భావించి సుందర బృందావనంగా తీర్చిదిద్దారు. 


పర్యాటక సొబగులతో విలసిల్లుతూ..

మినీ ట్యాంకుబండ్‌ అనగానే చుట్టూ కట్ట, పచ్చని మొక్కలు ఏర్పాటు చేస్తారు. కానీ కోమటిచెరువుకు పర్యాటక వైభవాన్ని కల్పించారు. చెరువు కట్టపై చిన్నారులకు ఆట వసతులు ఏర్పాటు చేశారు. సంగీతధ్వనులు ప్రభవించే మ్యూజిక్‌ సిస్టమ్స్‌ను అమర్చారు. లవ్‌ సిద్దిపేట అనే పెద్ద అక్షరాలను ఆకర్షణీయంగా చెక్కిపెట్టారు. ఇక చెరువును చుట్టివచ్చేలా ఐదు రకాల బోట్లు, పడవలను షికారు కోసం తెచ్చారు. ఇక్కడే క్యాంటీన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రశాంతత కలిగేలా ధ్యానమందిరం, యోగా కేంద్రాలను నిర్మించారు. చెరువుకట్ట పక్కనే అడ్వెంచర్‌ పార్కును అత్యద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ రోప్‌వేతోపాటు సాహసోపేతమైన క్రీడలతో చిన్నా, పెద్ద సమయాన్ని మరచి ఎంజాయ్‌ చేస్తుంటారు. అదే విధంగా కట్టపై తిరిగేందుకు ఎలక్ర్టిక్‌ వాహనం ఉంది. ఇవే గాకుండా వాటర్‌ ఫౌంటేన్లు, రంగురంగుల వాటర్‌ గేమ్స్‌ అలరిస్తుంటాయి. 10నెలల క్రితం కోమటిచెరువుపై భారీ సస్పెన్షన్‌ బ్రిడ్జిని నిర్మించారు. లక్నవరం తరహాలో నిర్మించిన ఈ బ్రిడ్జి చూపరులను ఆకట్టుకుంటున్నది. ఇక్కడే మిషన్‌ భగీరథ పైలాన్‌నూ నిరంతరం నీటిలో తడిసిముద్దయ్యేలా ప్రతిష్టించారు. దేశభక్తిని చాటేలా 110 అడుగుల ఎత్తున్న జాతీయ జెండా.. కళాదుందుభి మోగేలా ఓపెన్‌ఎయిర్‌ ఆడిటోరియం(కళాక్షేత్రం) నిర్మాణాలు స్పెషల్‌ ఎఫెక్టుగా నిలుస్తున్నాయి. 

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సైతం తనకు కాసేపు సమయం దొరికినా కోమటిచెరువుపై వాలిపోతుంటారు. వాకింగ్‌తోపాటు బోటింగ్‌ షికారు చేస్తుంటారు. ఇప్పుడు నెక్లెస్‌ రోడ్డు నిర్మాణంతో కోమటిచెరువు మరింత కలర్‌ఫుల్‌గా తయారైంది. 


నెక్లెస్‌ రోడ్డుతో కొత్త అందాలు

కోమటిచెరువు చుట్టూ సుమారు 4 కిలోమీటర్ల దూరం ఈ నెక్లెస్‌ రోడ్డును నిర్మిస్తున్నారు. ఎరుపు రంగుల పిల్లర్ల కిందుగా నిర్మించిన ఈ రహదారి వంకర్లు తిరుగుతూ అచ్చం నెక్లెస్‌ గొలుసును తలపించేలా కనిపిస్తున్నది. ఇక్కడ సైకిల్‌ ట్రాక్‌, వాకింగ్‌ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయాన్నే ఆహ్లాద వాతావరణంలో వ్యాయామం, నడక, జాగింగ్‌ చేసేలా వసతులు ప్రత్యక్షం కాబోతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన నెమలి, గద్ద తదితర విగ్రహాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నిరంతరం పర్యవేక్షణ ఉండేలా సీసీ కెమెరాల నిఘాతోపాటు లేక్‌ పోలిస్‌ ఔట్‌పోస్టును కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు.



Updated Date - 2020-12-07T05:30:00+05:30 IST