గ్రామాల్లో జోరుగా అంత్యోదయ సర్వే
ABN , First Publish Date - 2020-12-17T05:59:56+05:30 IST
సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల సమీక్షకు రాష్ట్ర

సంక్షేమ ఫలాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష
143 ప్రశ్నలతో సర్వే జాబితా
అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనే లక్ష్యం
మెదక్, డిసెంబరు 16: సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల సమీక్షకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో సర్వే చేపట్టారు. ఇందుకోసం ‘మిషన్ అంత్యోదయ సర్వే’ పేరిట పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు పల్లెల్లో ప్రజలను కలిసి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో ప్రారంభమైన సర్వే నెలాఖరు వరకు కొనసాగనుంది. ఇందుకోసం పంచాయతీ అధికారులు, గ్రామ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై శిక్షణ ఇచ్చారు.
పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు
15వ ఆర్థిక సంఘం ఎన్‌ఆర్‌జీఈఎ్‌స, ఎస్‌ఎ్‌ఫసీ సాధారణ నిధులతో వచ్చే ఆర్థిక సంవత్సరం గ్రామాల్లో చేపట్టాల్సిన వసతుల కల్పన, అభివృద్ధి పనులపై 143 ప్రశ్నలతో ప్రణాళిక రూపొందించారు. ఇందుకు గానూ ప్రభుత్వం వివిధ శాఖలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులను సర్వే ద్వారా పరిశీలిస్తారు. పార్ట్–ఏ లో 112, పార్ట్–బీలో 31 ప్రశ్నలను సర్వే ప్రణాళికలో పొందుపర్చారు. పార్ట్–ఏ లో ప్రభుత్వ పథకాల అమలు, ఆయా శాఖల పనితీరు, పార్ట్–బీలో గ్రామ జనాభా, కుటుంబాలు, మౌలికవసతుల అంశాలను పొందుపర్చారు. గ్రామ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారుల ద్వారా వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేయనున్నారు. అనంతరం గ్రామసభలు నిర్వహించి ప్రణాళికపై గ్రామంలో మెజారిటీ ప్రజలచే ఆమోదముద్ర వేయిస్తారు.
సమస్యల గుర్తింపు
ఈ మిషన్ అంత్యోదయ సర్వేలో ప్రజలు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా గుర్తిస్తున్నారు. ఇక గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులు పంచాయతీ సాధారణ నిధులలో ప్రాధాన్యతా క్రమంలో ఏయే అంశాలకు పెద్దపీట వేయాలనే విషయంపై ప్రజలతో నేరుగా చర్చించి ఆమోద ముద్ర వేయించనున్నారు. జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలోని 469 గ్రామాల్లో అమలు అవుతున్న ప్రభుత్వ పథకాల్లో లోటుపాట్లను సమీక్షించనున్నారు. గ్రామాల్లో ప్రధానంగా మురికి కాలువల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పించనున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం కొరవడడంతో అంటువ్యాదులు, డెంగీ, చికెన్‌గున్యా, స్వైన్‌ఫ్లూ, కలరా తదితర వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున పారిశుఽధ్య నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అనేక గ్రామాల్లో శుభ్రమైన నీరు అందకపోవడంతో ప్రజలు వర్షాకాలం సీజన్‌లో తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో పాటు మిషన్ భగీరథ పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించనున్నారు. వీటితో పాటు నిరుపేదలకు రేషన్ పంపిణీ, పెన్షన్లు అందజేతతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పలు సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను సర్వేలో ప్రస్తావించనున్నారు.