మంత్రికుంటకు మరో కంకర క్వారీ ముప్పు

ABN , First Publish Date - 2020-12-28T04:50:56+05:30 IST

ఆ మూడు గ్రామల శివారులో ఇప్పటికే ఉన్న కంకర క్రషర్లతో వాయు కాలుష్యం, పేలుళ్లు, నివాసాలకు పగుళ్లు, వ్యవసాయ బోరు మోటర్లు మట్టిలో కూలిపోవడం సహా పలు సమస్యలతో నిత్యం ఇక్కట్ల మధ్య బతుకుతున్న జనాలకు మరో నూతన క్వారీ ఏర్పాటుకు అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్‌ పిడుగులా మారింది.

మంత్రికుంటకు మరో కంకర క్వారీ ముప్పు
మంత్రికుంట సమీపంలో క్వారీ కోసం కేటాయించిన గుట్ట

మూడు గ్రామాల శివారులో  57ఎకరాల్లో ఏర్పాటుకు ప్రభుత్వ సన్నాహం

జనవరి 5న ప్రజాభిప్రాయ సేకరణకు  పీసీబీ నోటిఫికేషన్‌ జారీ

అనుమతించే ప్రసక్తే లేదంటున్న రైతులు

అఖిలపక్షం ఆధ్వర్యంలో క్వారీకి  వ్యతిరేకంగా తీర్మానం, కలెక్టరేట్‌లో ఫిర్యాదు


జిన్నారం, డిసెంబరు 27: ఆ మూడు గ్రామల శివారులో ఇప్పటికే ఉన్న కంకర క్రషర్లతో వాయు కాలుష్యం, పేలుళ్లు, నివాసాలకు పగుళ్లు, వ్యవసాయ బోరు మోటర్లు మట్టిలో కూలిపోవడం సహా పలు సమస్యలతో నిత్యం ఇక్కట్ల మధ్య బతుకుతున్న జనాలకు మరో నూతన క్వారీ ఏర్పాటుకు అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్‌ పిడుగులా మారింది. వ్యవసాయ పొలాల్లో కంకర మిషన్ల దుమ్ము పేరుకుపోవడం, బండరాళ్ల సేకరణకు నిత్యం జరిపే భారీ పేలుళ్లతో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పేర్కొన్నారు.


బొప్పన్‌ చెరువు, మంత్రికుంట గ్రామానికి సమీపంలోనే 

జిన్నారం మండలం మాధారం పంచాయతీ పరిధిలోని మంత్రికుంట గ్రామ శివారులో నూతన కంకర క్వారీ ఏర్పాటుకు ఈ నెల 5న పీసీబీ అధికారులు పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేశారు. ఇందులో జనవరి 5న క్వారీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. కాగా 5 ఎకరాల లోపు క్వారీలకు నేరుగా అనుమతులు దక్కితే.. ఇక్కడ ఏకంగా 57 ఎకరాల్లో క్వారీ ఏర్పాటు జరుగనుండగా ప్రజాభిప్రాయ సేకరణ తప్పని సరి. ఇక పీసీబీ ప్రకటనతో మాధారం, మంత్రికుంట, కొర్లకుంట గ్రామాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. ఇప్పటికే తమ గ్రామాల శివారులో ఉన్న 9 స్టోన్‌ క్రషర్లతో నిత్యం చావు బతుకుల మధ్య జీవిస్తుండగా.. కొత్తగా మరో భారీ క్వారీ ఏర్పాటు ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు. ఇటీవల గ్రామంలో సమావేశం నిర్వహించిన అఖిల పక్షం నాయకులు నూతన క్వారీ ఏర్పాటును విరమించుకోవాలని కలెక్టరేట్‌, పీసీబీలో ఫిర్యాదు కూడా చేశారు. 




ఉన్న వాటితోనే నిత్యం ఇక్కట్లు

మాధారం, కాజీపల్లి పంచాయతీల పరిధిలో ఉన్న స్టోన్‌ క్రషర్లతోనే నిత్యం నానా ఇక్కట్లు పడుతున్నామని మంత్రికుంట వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంకర కోసం బండరాళ్లను పేల్చేందుకు క్వారీ నిర్వాహకులు భారీ పేలుళ్లు జరుపుతున్నారు. ఇందుకోసం వాడే విస్ఫోటకంతో నేల భూకంపంలా కదిలి ప్రకంపనలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఇక్కడ ఉన్న అన్ని ఇళ్లు పేలుళ్ల ధాటికి పగుళ్లు, బీటలు వచ్చాయి. ఇక వ్యవసాయ బోర్లు పేలుడుతో జరిగే భూప్రకంపనల ధాటికి కూలిపోతున్నాయి. బండరాళ్లు పొలాల్లో పడి పంటలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో కొత్త క్వారీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తామని మంత్రికుంట యువజన సంఘం నాయకుడు అనిల్‌ తెలిపారు.


నా బోరు కూరుకుపోయింది

స్థానిక స్టోన్‌ క్రషర్ల పేలుళ్ల ధాటికి తన వ్యవసాయ బోరు భూమిలోనే కూరుకుపోయింది. రూ.15వేలు ఖర్చు చేసి తీసినా, బోరు రాలేదు. స్థానికంగా వ్యవసాయం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. 

                                   -పద్మారావు, రైతు 


పొలాలకు దగ్గరలో క్వారీతో తీవ్ర నష్టం

మంత్రికుంట గ్రామానికి, బొప్పన్‌ చెరువు, పచ్చని పొలాలకు సమీపంలో క్రషర్‌ ఏర్పాటుతో వ్యవసాయం పూర్తిగా కనుమరుగవుతుంది. నీటి వనరులు పూర్తిగా దెబ్బతింటాయి. క్వారీకి అనుమతి వస్తే మూడు గ్రామాలకు ముప్పే.                

                         -రైతు యాదయ్య


నూతన క్వారీ ఏర్పాటును అడ్డుకుంటాం

తమ పంచాయతీ పరిధిలోని మంత్రికుంట శివారులో నూతన క్వారీ ఏర్పాటును అడ్డుకుంటాం. ఇప్పటికే ఉన్న క్రషర్లతో నిత్యం తీవ్రంగా నష్టపోతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా గ్రామానికి 200 మీటర్ల పరిధిలో క్వారీ ఏర్పాటు ఎలా చేస్తారు. ప్రజాభిప్రాయ సేకరణలో తమ వాదనలు వినిపిస్తాం. అఖిల పక్షం ఆధ్వర్యంలో గ్రామ సభలో నూతన క్వారీ ఏర్పాటుకు వ్యతిరేకంగా తీర్మానం చేశాం.

-సర్పంచ్‌ సరిత

Updated Date - 2020-12-28T04:50:56+05:30 IST