గడువులోపు పూర్తయ్యేనా?
ABN , First Publish Date - 2020-03-16T07:39:18+05:30 IST
అనంతగిరి (అన్నపూర్ణ) ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను మెట్ట ప్రాంతమైన బెజ్జంకి మండలానికి తరలించేందుకు కాలువ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
అనంతగిరి కాలువ నిర్మాణానికి జూన్ వరకు గడువు
14,930 ఎకరాల ఆయకట్టుకు సాగునీరివ్వడమే లక్ష్యం
కొనసాగుతున్న ఎండీసీ-7 కాలువ నిర్మాణం
ఇప్పటి వరకు పూర్తయినది 75 శాతం పనులు
ఇంకా నాలుగు నెలలే సమయం
పెండింగ్ పనులను పూర్తిచేయడం కష్టమే!
బెజ్జంకి, మార్చి 14: అనంతగిరి (అన్నపూర్ణ) ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను మెట్ట ప్రాంతమైన బెజ్జంకి మండలానికి తరలించేందుకు కాలువ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 14,930 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే లక్ష్యంతో ఎండీసీ-7 కాలువ నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. మండల వ్యాప్తంగా ఎనిమిది గ్రామాల మీదుగా 15 కిలోమీటర్ల పొడవునా కాలువ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జూన్ 2020 వరకు నిర్మాణ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. కానీ పనుల్లో జాప్యం కారణంగా గడువులోగా నీరందే అవకాశం కనిపించడం లేదు.
ఎనిమిది గ్రామాలకు ఆదెరువు
అనంతగిరి ప్రాజెక్టు నుంచి ఎండీసీ-7 కాలువ బెజ్జంకి మండలంలోని ఎనిమిది గ్రామాల మీదుగా వెళ్తుంది. చిన్నకోడూరు మండలంలోని కిష్టాపూర్ గ్రామం వద్ద మొదలైన కాలువ గుండారం, బెజ్జంకి, ముత్తన్నపేట, దాచారం, విరపూర్, తోటపల్లి, కల్లేపల్లి, బేగంపేట గ్రామాల నుంచి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోకి ప్రవేశిస్తుంది. ఆయా గ్రామాల్లోని బీడు భూములు గోదావరి జలాలతో సస్యశ్యామలం కానున్నాయి.
జూన్ వరకు పూర్తి అయ్యేనా?
అనంతగిరి (అన్నపూర్ణ) ప్రాజెక్టు నుంచి బెజ్జంకి మండలానికి వెళ్లే కాలువ పనులు జూన్ వరకు పూర్తిచేయడమే లక్ష్యంగా అధికార వర్గాలు నిర్ధేశించాయి. మండలంలో 15 కిలోమీటర్ల మేర చేపట్టిన కాలువ నిర్మాణ పనులు 75 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి. అనుకున్న గడువు లోపు కాలువ నిర్మాణ పనులు పూర్తయి పూర్తయితే మండలంలోని 15 వేల ఎకరాలు గోదావరి జలాలతో తడిసే అవకాశముంటుంది. రైతులు కాల్వ పనులు ఎప్పుడు పూర్తవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
కానీ గడువులోపు పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అధికార వర్గాల సమాచారం ఎలాఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు ఇప్పుడు జరుగుతున్న వేగంతో కొనసాగితే జూన్ వరకు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పలు గ్రామాల్లో ఇప్పటికీ బ్రిడ్జిల నిర్మాణం ప్రారంభించనే లేదు. కొనిచోట్ల సీసీ చేయలేదు. దీంతో వచ్చే వర్షాకాలానికి నీళ్లు వస్తాయని ఎదురు చూస్తున్న రైతుల ఆశలు నెరవేరేలా లేవు.