ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలి
ABN , First Publish Date - 2020-12-30T05:34:33+05:30 IST
రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించారు.

బీజేవైఎం ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం
సిద్దిపేట అర్బన్, డిసెంబరు 29 : రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల సమీపంలో బీజేవైఎం కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రహదారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కలుగజేసుకొని దిగ్బంధాన్ని విరమించాలని కోరినప్పటికీ కార్యకర్తలు వినకుండా రోడ్డుపై బైఠాయించడంతో రూరల్ సీఐ సురేందర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్‌ఐ శంకర్ తమ సిబ్బందితో కలిసి కార్యకర్తలను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సురేష్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు తాటికొండ శ్రీనివాస్, కార్తీక్, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.