తుక్కాపూర్‌లో బ్లాస్టింగ్‌ భయం

ABN , First Publish Date - 2020-12-03T05:30:00+05:30 IST

తుక్కాపూర్‌ గ్రామస్థులు బ్లాస్టింగ్‌లతో భయ పడుతున్నారు. తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో తుక్కాపూర్‌ గ్రామ శివారులో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

తుక్కాపూర్‌లో బ్లాస్టింగ్‌ భయం

పేలుళ్లతో అదురుతున్న ఇళ్లు


తొగుట, డిసెంబరు 3 : తుక్కాపూర్‌ గ్రామస్థులు బ్లాస్టింగ్‌లతో భయ పడుతున్నారు. తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో తుక్కాపూర్‌ గ్రామ శివారులో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు కట్ట పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఇక్కడ పంపు హౌస్‌, డెలివరీ సిస్టం పనులు పూర్తయ్యాయి. కాగా రంగనాయకసాగర్‌ నుంచి ఇక్కడి పంప్‌హౌ్‌సకు తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్‌కు కాలువ ద్వారా తరలించారు. అయితే ఇంకో అదనపు టీఎంసీ కోసం మిడ్‌ మానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు 300 మీటర్ల వెడల్పుతో ఓపెన్‌ కెనాల్‌ పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయగా నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోర్టు పర్యావరణ అనుమతులు లేకుండా ఎలాంటి పనులు చేపట్టవద్దని తీర్పు వెలువరించింది. అయినప్పటికీ తుక్కాపూర్‌లోని ఇళ్ల నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో అదనపు టీఎంసీ ఎత్తిపోతల కోసం పనులను అధికారులు శరవేగంగా చేస్తున్నారు. అందులో భాగంగా రాళ్లను తొలగించేందు కోసం బ్లాస్టింగ్‌ చేపడుతున్నారు. పేలుళ్లతో గ్రామంలోని ఇళ్లు అదురుతున్నాయని గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ పేలుళ్ల సమాచారమివ్వడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. దాంతో రాళ్లు ఇళ్లపై పడటంతో పాటు పలువురికి గాయాలయ్యాయని చెప్పారు. ఒకవైపు పేలుళ్ల చప్పుళ్ళు, టిప్పర్ల మోతలు, మరో వైపు దుమ్ము దూళీతో ఇక్కడ ఉండలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

Updated Date - 2020-12-03T05:30:00+05:30 IST