నిన్నటి దాకా నిప్పులు.. నేడు ఆత్మీయ పలకరింపులు
ABN , First Publish Date - 2020-12-06T05:36:11+05:30 IST
నిన్నటి వరకు ఉప్పు, నిప్పుగా ఉన్న ఇద్దరు ఇప్పుడు ఒకే వేదికను పంచుకున్నారు. ఎన్నికల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో మార్మోగిన గొంతులు ఇప్పుడు ఆత్మీయ పలకరింపుతో అందరినీ ఆశ్చర్యపరిచారు.

దుబ్బాకలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఎమ్మెల్యే రఘునందన్‌రావును అభినందించిన ఎంపీ కేపీఆర్
దుబ్బాక, డిసెంబరు 5 : నిన్నటి వరకు ఉప్పు, నిప్పుగా ఉన్న ఇద్దరు ఇప్పుడు ఒకే వేదికను పంచుకున్నారు. ఎన్నికల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో మార్మోగిన గొంతులు ఇప్పుడు ఆత్మీయ పలకరింపుతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎన్నికల వరకే పట్టింపులని.. ముగిశాక సంస్కారవంతమైన విలువలను పాటిస్తామని నిరూపించారు. శనివారం దుబ్బాక ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొన్నారు. మొన్నటివరకు నిప్పులు చెరిగిన ప్రత్యర్థులు ప్రభుత్వ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావును ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి సన్మానించి అభినందించారు. ఎన్నికల వరకే పార్టీలని, తనకు ఎలాంటి భేషజాలు లేవని రఘునందన్‌రావు తెలిపారు. దుబ్బాక అభివృద్ధికి పార్టీలను పక్కనబెట్టి, కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వనితాభూంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.