గెస్ట్‌ లెక్చరర్ల గతేంటి?

ABN , First Publish Date - 2020-12-04T05:29:55+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లు రోడ్డుపడ్డారు.

గెస్ట్‌ లెక్చరర్ల గతేంటి?

పాత వారిని తొలగించాలని సర్కారు ఆదేశాలు 

ఉమ్మడి జిల్లాలో 220 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీ


మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 3 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లు రోడ్డుపడ్డారు. వీరందరినీ తొలగిస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్త వారి సెలక్షన్స్‌ చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న అతిథి అధ్యాపకుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 220 మంది గెస్ట్‌ లెక్చరర్లు పనిచేస్తున్నారు. 

ఏటా జూన్‌లో ప్రారంభమయ్యే కళాశాలలు ఈసారి కరోనా కారణంగా సాధ్యపడలేదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విద్యార్థులకు తరగతులను బోధిస్తూ సందేహాల నివృత్తికి విద్యార్థులను కరోనా నిబంధనలతో కళాశాలలకు రెండు గంటల పాటు అనుమతిస్తున్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్‌ లెక్చరర్లను మాత్రమే విధుల్లోకి తీసుకున్న సర్కార్‌ వారి విషయంలోనూ రెన్యువల్‌ చేయలేదు. అంతేకాకుండా కొత్తగా గెస్ట్‌ ఫ్యాకల్టీలను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి కొత్తగా వారితో పాటు ఇదివరకు పనిచేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, మెరిట్‌ ప్రకారం ఎంపిక చేయనున్నారు. కాగా ఏళ్లుగా వెట్టిచాకిరి చేయించుకొని ఇప్పుడు తమ బతుకులను రోడ్డుపాలు చేశారని గెస్ట్‌ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల్లో వేతనం తీసుకుని రెగ్యులర్‌ అధ్యాపకులతో సమానంగా తరగతులు చెబుతున్న తమకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు. 


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..

మెదక్‌ జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలుండగా.. 12 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు, 129 ఒప్పంద అధ్యాపకులు, 64 మంది గెస్ట్‌ లెక్చరర్లు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 17 ప్రభుత్వ కళాశాలలుండగా 54 మంది రెగ్యులర్‌, 133 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, 84 మంది అతిథి అధ్యాపకులున్నారు. సిద్దిపేట జిల్లాలో 20 ప్రభుత్వ కళాశాలుండగా 22 మంది రెగ్యులర్‌, 173 కాంట్రాక్ట్‌, 72 గెస్ట్‌ ఫ్యాకల్టీ పని చేస్తున్నారు.


రెన్యువల్‌ చేయాలి

కరోనా విపత్తు నేపథ్యంలో గెస్ట్‌ లెక్చరర్లలందరినీ మానవతా దృక్పథంతో రెన్యువల్‌ చేయాలి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వర్తించాం. పాత వారిని కొనసాగిస్తూ ఖాళీలున్న చోట కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. 

- వెంకటేశం, అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు


ప్రభుత్వ నిర్ణయం మేరకే ముందుకు

 ప్రసుత్తం కాంట్రాక్ట్‌ లెక్చరర్లను విధుల్లోకి తీసుకొని ఆన్‌లైన్‌ తరగతుల పర్యవేక్షణ, విద్యార్థుల సందేహల నివృత్తి చేస్తున్నాం. కొత్త వారిని నియమించాలని ఆదేశాలు అందాయి. పాత వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతాం.

- సూర్యప్రకాశ్‌, డీఐఈవో, మెదక్‌


Updated Date - 2020-12-04T05:29:55+05:30 IST