ప్రమాదమ్మీద ప్రమాదం
ABN , First Publish Date - 2020-12-05T06:26:00+05:30 IST
ప్రమాదమ్మీద ప్రమాదం

వెంటవెంటనే విరుచుకుపడిన మృత్యువు
రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
మృతుల్లో తల్లిదండ్రులు, కుమారుడు
12 మందికి తీవ్ర గాయాలు
క్షతగాత్రుల్లో సీఐ, కానిస్టేబుల్
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు
పోలీసులు, స్థానికుల సహాయక చర్యలు
వారిపై నుంచి దూసుకెళ్లిన వ్యాను
తొలి ప్రమాదంలో ముగ్గురు.. రెండో ప్రమాదంలో ఇద్దరు మృతి
సిద్దిపేట పట్టణ శివారులో ఘోరం
సిద్దిపేట క్రైం, డిసెంబరు 4: సాగిపోయే జీవితం ముగిసిపోయే సమయం.. మృత్యువై విరుచుకుపడే క్షణం ఎవరికి ఎరుక? ఆ క్షణమే అత్యంత భయానకమైనదని.. తమనూ మృత్యువై కబళిస్తుందని.. తేలిన రక్తమాంసాలు, విరిగిన కాళ్లూ చేతులతో క్షతగాత్రులుగా చిత్రవధ అనుభవించాల్సి వస్తుందని తెలిస్తే, వారెందుకు సహాయక చర్యలకు దిగుతారు? ఘోర ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే మరో ఘోర ప్రమాదం జరుగుతుందని వారు ఊహిస్తారా? ప్రమాదంలో ఉన్నవారికి సాయం చేయాలని వారు తలిస్తే విధి మరోలా తలిచి మృత్యుకేకతో వికటాట్టహాసం చేసింది. శుక్రవారం సిద్దిపేట పట్టణ శివారు రోడ్డు రక్తమోడింది. ప్రమాదం వెంటనే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రెండు ఘటనల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 12మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.. వృద్ధ దంపతులు.. వారి కుమారుడు!
ఎలా జరగింది?
బయ్యాపు నరేందర్ రెడ్డి (39)ది పెద్దపల్లి జిల్లా కేంద్రం. హుజురాబాద్‌లో న్యాయవాద వృత్తిలో ఉన్నారు. తండ్రి రాజిరెడ్డి (62) అనారోగ్యానికి గురవడంతో చికిత్స కోసం తల్లి విజయ (58)తో కలిసి హైదరాబాద్‌కు కారులో బయలుదేరాడు. ఈ ముగ్గురు ప్రయాణిస్తున్న కారు.. సిద్దిపేట శివారులోని రంగిలాదాబా చౌరస్తా వద్దకు రాగానే అదుపుతప్పింది. మితిమీరిన వేగంతో ఎడమవైపు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న నరేందర్ రెడ్డి, ఆయన పక్కన కూర్చున్న రాజిరెడ్డి, వెనుక సీట్లో కూర్చున్న విజయ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలియడంతో సమీపంలోని టూటన్ పోలీస్ స్టేషన్లో ఉన్న సీఐ పరుశురాం గౌడ్, తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి బయలుదేరారు. అప్పటికే.. ఓ కేసు విషయంలో సీఐతో మాట్లాడేందుకు వచ్చిన సిద్దిపేట మండలం మదనపల్లికి చెందిన 20మంది కూడా సహాయక చర్యల కోసం ఆయన వెంట కదిలారు. పోలీసుల బృందం, మదనపల్లికి చెందిన వ్యక్తులు కలిసి సహాయక చర్యలు చేపడుతుండగానే కరీంనగర్ వైపు నుంచి మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ డీసీఎం అదుపుతప్పి ఘటనా స్థలంలో గుమిగూడిన జనమ్మీదికొచ్చింది. ఈ ప్రమాదంలో మందపల్లి గ్రామానికి చెందిన వర్ధన్నపేట ఎల్లారెడ్డి(50), రామునిపట్లకు చెందిన అనరాశి మల్లేశం(35) మృతిచెందారు. సీఐ పరుశురాం గౌడ్, కానిస్టేబుల్ అశోక్‌తో పాటు 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో టూ టౌన్ సీఐ పరుశురాం గౌడ్, కానిస్టేబుల్ అశోక్, మందపల్లికి చెందిన మాధవరెడ్డి, దుర్గారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజిరెడ్డి, రామచంద్రారెడ్డి, చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామానికి చెందిన అశోక్, లింగారెడ్డిపల్లికు చెందిన దుర్గారెడ్డి, సిద్దిపేటకు చెందిన లింగయ్య ఉన్నారు. మృతదేహాలను సిద్దిపేట జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట ప్రైవేట్ ఆస్పత్రికి,హైదరాబాద్ కు తరలించారు.
మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట శివారులో రాజీవ్ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అందుకుంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
